Sankarabharanam Movie: శంకరాభరణం.. అలనాటి అద్భుత కళాత్మక దృశ్య కావ్యం. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప సినిమా. 1980, ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా.. నేటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. కళా తపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులు సొంతం చేసుకుంది.
శంకరాభరణం చిత్రాన్ని పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు.
అప్పట్లోనే పాన్ ఇండియా మూవీ రికార్డు విజయాన్ని అందుకోవడమే కాకుండా.. అమెరికాలో కూడా రెగ్యులర్ థియేటర్స్‌లో విడుదలైన మొట్ట మొదటి చిత్రంగా నిలిచింది. అమెరికాతోపాటు చాలా దేశాల్లో రిలీజ్ అయి.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది.
శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో శంకరాభరణం చరిత్రను తిరగరాసింది. ఈ సినిమాను చూసిన తరువాత ఎంతోమంది శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అప్పట్లో ఎవరి నోటా విన్నా.. శంకరాభరణం మూవీ గురించే ప్రస్తావన ఉండేది.
అవార్డుల విషయానికి వస్తే.. జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు సినిమా శంకరాభరణం. గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. ఎస్పీబీతోపాటు వాణి జయరామ్‌కు ఉత్తమ గాయకురాలుగా, కేవీ మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డులు అందుకున్నారు.
Besancon ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఫ్రాన్స్)లో బెస్ట్ మూవీగా ఇంటర్‌నేషనల్ అవార్డు అందుకుంది. ఏపీలో 8 నంది అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాపై చాగంటి కోటేశ్వర రావు మూడు రోజులు ప్రవచనాలు కార్యక్రమం చేయడం విశేషం.
ఈ సినిమా తరువాత జేవీ సోమయాజులును శంకరాభరణం శంకరశాస్త్రి అని అందరూ పిలిచారు. తులసి పాత్రలో మంజు భార్గవి జీవించారు. ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా భాషతో సంబంధం లేకుండా అందరినోటా వినిపిస్తునే ఉంటాయి. సినిమా విడుదలై 45 ఏళ్లు అయినా.. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదు.