ప్రపంచంలో క్రికెట్ ను అభిమానించే వారిలో 90 శాతం మంది భారత ఉపఖండంలోనే ఉన్నట్లు తేలింది. ఐసీసీ నిర్వహించిన మార్కెట్ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. క్రికెట్ అభివృద్ధికి ఉన్న అవకాశాలు, భవిష్యత్తు వృద్ధి కోసం విధాన రూపకల్పన, నిర్ణయాలు తీసుకోవడంలో ఐసీసీకి మార్గదర్శనం చేసేందుకు ఈ పరిశోధన నిర్వహించడం జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా 16-69 మధ్య వయసు కలిగిన వారి నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు దాదాపు 100 కోట్ల మంది ఉండగా..వారిలో 90 శాతం భారత్ లోనే ఉండటం గమనార్హం
ఐసీసీ నిర్వహించిన మార్కెట్ పరిశోధనలో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. క్రికెట్ ను అభిమానించే వారిలో 70 శాతం మంది ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. టెస్ట్ క్రికెట్ కు కాలం చెల్లిందనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇది తప్పని తాజా పరిశోదనలో తేలింది. కాగా క్రికెట్ ఆరాధించే వారిలో టీ 20 మ్యాచులను 92 శాతం మంది ఇష్టపడుతుంటే.. వన్డే మ్యాచులను 88 శాతం మంది ఇష్టపడతున్నారు. టీ 20 క్రికెట్ అభిమానించే వారు పాకిస్థాన్ లో 98 శాతం మంది ఉండటం గమనార్హం.