తనకు ఎలాంటి ఫోబియా లేదని నిరూపించిన సింధు !!

తనకు ఫైనల్ ఫోబియాను లేదని ప్రపంచానికి నిరూపించింది పివి. సింధు

Last Updated : Aug 27, 2019, 12:28 AM IST
తనకు ఎలాంటి ఫోబియా లేదని నిరూపించిన సింధు !!

తెలుగు తేజం పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించడం తెలిసిందే. కాగా తాజా విజయంతో ఆమెపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె ఆటతీరును విమర్శకులు సైతం ఆమె ప్రదర్శనకు ఔరా అనక ఉండలేకపోతున్నారు.

ప్రపంచకప్ టైటిల్ గెలవక ముందు వరకు సింధుకు ఫైనల్ ఫోబియా ఉందంటూ తీవ్ర విమర్శలు వచ్చారు. పదే పదే ఇదే అంశాన్ని లేవెనెత్తి చాలా మంది ఎద్దేవ చేశారు. అందుకు కారణాలు లేకపోలేదు.  2016 రియో ఒలింపిక్స్ లో ఫైనల్లో ఓటమి అనంతరం సింధుపై ఇలా విమర్శలు మొదలయ్యాయి. ఆ తర్వాత తాను చాలా టోర్నీల్లో ఫైనల్స్ లో ఓడిపోవడంతో ఆమెకు ఫైనల్ ఫోబియా ఉందనే కామెంట్స్ కు బలాన్ని చేకూరాయి. తాజా విజయంతో తనకు ఫైనల్ ఫోబియా లేదని నిరూపించిన పివి సింధు... తనకు ఎలాంటి ఫోబియా లేదని విమర్శకులకు రాకెట్ తో సమాధానం ఇచ్చింది.

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన అనంతరం ఇదే విషయాన్ని సింధు గుర్తు చేసుకుంది. తనకు ఫైనల్ ఫోబియా ఉందని ఎంతో మంది తనను విమర్శించే వారని...అలాంటి వాళ్లకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్  ఫైనల్లో తాను సాధించిన విజయమే సమాధానం అని సింధు పేర్కొంది. తాను సాధించిన ఘనతలను పక్కన పెట్టి ఫైనల్ ఫోబియా అంటూ అదే పనిగా తనపై విమర్శలు గుప్పించినోళ్లకు  తన రాకెట్ తోనే బదులిచ్చానని పివి సింధు గర్వంగా చెప్పింది. 

Trending News