సీట్ల సెగ: సీపీఐ, టీజేఎస్ మహాకూటమికి గుడ్ బై..?

సీట్ల సెగ: సీపీఐ, టీజేఎస్ మహాకూటమికి గుడ్ బై..?

Last Updated : Oct 24, 2018, 09:12 AM IST
సీట్ల సెగ: సీపీఐ, టీజేఎస్ మహాకూటమికి గుడ్ బై..?

మహా కూటమిలో సీట్ల విషయంపై ఇప్పటివరకేమీ స్పష్టమైన ప్రకటన రాలేదు. ప్రస్తుతం మహాకూటమిలోని భాగస్వామ్యులు కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి నేతలు సీట్ల సర్దుబాటుపై చర్చోపచర్చలు జరుపుతున్నారు. అయితే సీట్ల సర్దుబాటులో ఏదైనా గందరగోళం నెలకొంటే టీఆర్‌ఎస్‌ను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ఆవిర్భవించిన మహాకూటమి విచ్ఛిన్నం కానుందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు మహాకూటమికి గుడ్‌బై చెప్పనున్నారని స్థానిక మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. మహాకూటమిలో తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని సీపీఐ, టీజేఎస్‌ పట్టుబట్టుతున్నాయి. లేకపోతే, కూటమికి గుడ్‌బై చెప్పేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేస్తున్నాయి.

స్థానిక మీడియా కథనాల మేరకు.. ఇటీవలి కాంగ్రెస్ భేటీలో టీజేఎస్‌కు 36 సీట్లు ఇవ్వాలని కోదండరాం జాబితా ఇచ్చారు. చివరికి వాటిలో 17 సీట్లైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకే సుముఖత ఉంది. దీన్ని టీజేఎస్ పార్టీ కోర్ కమిటీలో ఉంచగా నేతలు తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే కూటమిని వీడేందుకు సిద్ధపడాలని కొందరు నేతలు కోందండరాంకు చెప్పినట్లు సమాచారం. ఒంటరిగా పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పార్టీ నేతలు చెప్పారట.

అటు సీపీఐ కూడా ఇదే దారిని ఎంచుకుంది. తమకు  రెండు, మూడు సీట్లంటే మాత్రం మహా కూటమికి గుడ్‌బై చెప్తామని సీపీఐ నేతలు అంటున్నారట. లేకపోతే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని భావిస్తున్నారట.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 119 నియోజకవర్గాలకు గాను 22 సీట్లను మిత్రపక్షాలకు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖంగా ఉందని తెలిసింది. దీని ప్రకారం, టీడీపీ 12, టీజేఎస్‌ 7, సీపీఐ రెండు/మూడు చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది. ఈమేరకు ఆదివారం మరోసారి మిత్రపక్షాలతో కాంగ్రెస్‌ చర్చించే అవకాశం ఉంది. అయితే టీడీపీ 20 స్థానాలు,  టీజేఎస్‌17 సీట్లు, సీపీఐ 12 లేదా గౌరవప్రదమైన స్థానాలైనా దక్కుతాయని భావిస్తున్నాయి.

కాగా ఇవాళ హైదరాబాద్‌‌లో టీ-టీడీపీ నేతలతో పొత్తులు, సీట్ల పంపకాలు, ప్రచార కార్యక్రమాలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.

అటు కేసీఆర్ కూడా మహాకూటమిపై ఒక కన్నేసి ఉన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఏదైనా పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తే అది క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట.

 

Trending News