Dasoju Sravan: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ కమలం పార్టీలో చేరారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు దాసోజు శ్రవణ్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, బిజెపి ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేత మురళీధర్ రావు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ కి బిజెపి పార్టీ సభ్యత్వం ఇచ్చారు తరుణ్ చుగ్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,
దాసోజు శ్రవణ్ తోపాటు ఆయన మద్దతదారులు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేసిన దాసోజు శ్రవణ్.. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా ప్రకటన సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలా మార్చేశారని మండిపడ్డారు.
బీజేపీలో చేరిన దాసోజ్ శ్రవణ్ కు వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆ పార్టీ పెద్దల నుంచి హామీ లభించిందని తెలిసింది. శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో కలిసి ఢిల్లీకి వెళ్లిన దాసోజు.. తరుచ్ చుగ్ తో సమావేశమయ్యారు. కాని పార్టీలో చేరలేదు. ఆదివారం ఉదయం జాయిన్ అయ్యారు. తనకు పార్టీలో ఎలాంటి అవకాశాలు ఉంటాయన్న దానిపై బీజేపీ పెద్దలతో చర్చల కోసమే శనివారం చేరిక జరగలేదంటున్నారు. ఎంపీ టికెట్ పై కమలం అగ్ర నేతల నుంచి శ్రవణ్ కు హామీ వచ్చిందని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా రాజకీయం చేశారు శ్రవణ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ఖైరతాబాద్ కేంద్రంగానే ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చారు. గ్రేటర్ లో రాజకీయం చేస్తున్న దాసోజు శ్రవణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు. ఆయన సొంతూరు భువనగిరి అసెంబ్లీ పరిధిలో ఉంది.
2008లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు దాసోజు శ్రవణ్. తన వాగ్దాటితో కొద్ది కాలంలోనే చిరంజీవి, పవన్ కల్యాణ్ కు దగ్గరయ్యారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాసోజుకు 91 వేల ఓట్లు వచ్చాయి. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా కొద్ది కాలానికే కేసీఆర్, కేటీఆర్ కు బాగా క్లోజ్ అయ్యారు. వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ ఆశించారు శ్రవణ్. కేసీఆర్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి జాతీయ అధికార ప్రతినిధిగా ఎదిగారు. ఇప్పుడు బీజేపీలో చేరడంతో శ్రవణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? బీజేపీ హైకమాండ్ ఆయనకు ఎలాంటి హామీ ఇచ్చింది అన్నది ఆసక్తిగా మారింది.
దాసోజు శ్రవణ్ కు సంబంధించి బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీ టికెట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఖైరతాబాద్ బీజేపీ ఇంచార్జ్ గా చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయనను కాదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ దాసోజుకు ఇచ్చే అవకాశం లేదు. అందుకే శ్రవణ్ సొంతూరైన భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కమలం పార్టీ పెద్దలు అంగీకరించారని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు శ్రవణ్ కోరుకున్నది కూడా ఇదే సీటు. ఒక వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్జి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సికింద్రాబాద్ ఎంపీ సీటుకు శ్రవణ్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. మొత్తంగా భువనగిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ నుంచి బీజేపీ తరపున దాసోజు శ్రవణ్ పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే సికింద్రాబాద్ కంటే తన సొంత ప్రాంతమైన భువనగిరి నుంచి పోటీ చేయడానికే శ్రవణ్ ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. భువనగిరి ఎంపీ పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2014లో బూర నర్సయ్య గౌడ్ విజయం సాధించడానికి బీసీ కార్డే పని చేసిందనే అభిప్రాయం ఉంది. అందుకే బీసీ నేతగా గుర్తింపు ఉన్న దాసోజు శ్రవణ్ భువనగిరి ఎంపీగా పోటీ చేసేందుకే ఆసక్తిగా ఉన్నారని ఆయన అనచరులు చెబుతున్నారు.
Also read:Flipkart Offers: శాంసంగ్ రెడీ LED టీవీ మరి ఇంత డెడ్ చీపా..? రూ. 3,990లకే టీవీ.!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Dasoju Sravan: కమలం గూటికి చేరిన దాసోజు శ్రవణ్.. ఆ సీటు నుంచే ఎంపీగా పోటీ? బీజేపీ హైకమాండ్ హామీ...
బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్
ఎంపీ టికెట్ హామీ ఇచ్చిన బీజేపీ
శ్రవణ్ పోటీ చేసేది ఆ సీటు నుంచే?