వరంగల్: పవిత్ర మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వేయి స్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామికి రాష్ట్రమంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం వేయి స్తంభాల గుడిని దర్శించుకున్న ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్లు మహా శివరాత్రి రోజున రుద్రేశ్వరుడికి పాలాభిషేకం చేశారు. పరమ శివుడు రాష్ట్ర ప్రజలను సంతోషంగా చూడాలని ఆకాంక్షించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రులు మీడియాలో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామని చెప్పారు. వేయి స్తంభాల గుడి చారిత్రకమైన కట్టడమని కొనియాడారు. జాతీయ సంపదగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఆలయానికి సరైన అభివృద్ధి జరగలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు చాలా నిధులు ఇచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర బిడ్డలమైన తాము వేయి స్తంభాల ఆలయం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.