దళితులకు ప్రభుత్వం, సమాజం అండగా ఉండాలి: సీఎం కేసీఆర్

దళితుల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు.

Last Updated : Apr 5, 2018, 09:08 AM IST
దళితులకు ప్రభుత్వం, సమాజం అండగా ఉండాలి: సీఎం కేసీఆర్

దళితుల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. 'భారత్‌ బంద్‌' సందర్భంగా వివిధ రాష్ట్రాలలో దళితులపై జరిగిన దాడులను కేసీఆర్‌ ఖండించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ న్యాయస్థానం మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. సుప్రీం మార్గదర్శకాలు దళితుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తెలియజేయాలన్నారు. దళితులు చేస్తున్న పోరాటాన్ని  ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని, మీ వెంట మేమూ ఉన్నామని దళితులకు ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు.

దళితులకు అన్ని విధాల ప్రభుత్వం, సమాజం అండగా నిలవాలని కేసీఆర్‌ కోరారు. దళితులకు అండగా ఉండటం కోసమే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారన్నారు. దళితులకు రక్షణగా ఉండడం కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేసిందన్నారు. దళితులకు కల్పించిన హక్కులు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం జారీ చేసిన మార్గదర్శకాలు సరికావని.. తమ హక్కులను కాలరాసేలా ఉన్నాయని దళితులు భావిస్తున్నారన్నారు. దళితుల అభిప్రాయాలను, మనోవేదనను న్యాయస్థానాలు కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Trending News