How to complain Electricity Department Issues With Rains: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమ విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉంది అని టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కరుస్తున్న వర్షాలు, ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయని, మరో 345 కరెంట్ స్తంభాలు విరిగిపోయాయని... అయినప్పటికీ వెనువెంటనే స్పందిస్తూ చాలా వరకు పునరుద్ధరణ చేస్తూ వస్తున్నాం అని రఘుమా రెడ్డి తెలిపారు. ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు తమ ఉద్యోగులు, ఇంజనీర్స్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంజనీర్స్ కు సెలవులు రద్దు చేశాం. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను అదేశించాం. ఇంజనీర్స్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు తమ తమ హెడ్ క్వార్టర్స్‌లోనే అందుబాటులోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అత్యవసర పరిస్థితుల్లో రంగంలోకి దిగి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించినట్టు రఘుమా రెడ్డి పేర్కొన్నారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాల కారణంగా ఏమైనా నష్టం వాటిల్లితే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి అని టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ సూచించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ స్తంభాల ద్వారా ఒక్కోసారి విద్యుత్ ప్రవహించే ప్రమాదం ఉంటుంది కనుక రాష్ట్ర ప్రజలు, విద్యుత్ వినియోగదారులు విద్యుత్ స్తంభాలు, వైర్లు నీళ్లలో ఉన్న కరెంట్ వైర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తాకవద్దు. స్తంభం స్టే వైరును కూడా ముట్టుకోవద్దు అని రఘుమా రెడ్డి హెచ్చరించారు.
ఎక్కడైనా వైర్లు తెగిపడినా, విద్యుత్ స్తంభాలతో ప్రమాదకర పరిస్థితులు ఉన్నా తమ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు, ఇతర కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా పౌరులకు సూచించారు. 1912, 100, 7382071574, 7382072106, 7382072104 నెంబర్లలో ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపారు. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్‌లో విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారు.
వర్షా కాలంలో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లో కరెంట్ ఆఫ్ చేయండి అని సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయితే వెంటనే తమకు పై నెంబర్ల ద్వారా పిర్యాదు చేయండి. తాము వెంటనే అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడం కానీ లేదా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ చేస్తాము అని అన్నారు. అపార్ట్మెంట్ సెల్లర్లలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాకాలంతో మీటర్లు నీట మునిగితే, విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి విద్యుత్ మీటర్లను పై పోర్షన్లో పెట్టుకోండి. అందుకోసం విద్యుత్ శాఖ స్థానిక సిబ్బందిని సంప్రదిస్తే.. మీటర్లను మరో చోట బిగించడం కోసం వారు మీకు సహాయం చేస్తారు అని టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి తెలిపారు.