హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన రోజు ఒక అరుదైన రికార్డు నమోదైంది. ఒకే రోజు మెట్రో స్టేషన్లలో 45000 మంది సెల్ఫీలు తీసుకున్నట్లు సీసీ టీవీల ద్వారా వెల్లడైందని నిఘా వ్యవస్థ అధికారులు చెబుతున్నారు. అందులో అత్యధికంగా 25000 సెల్ఫీలు మియాపూర్ స్టేషన్లో ప్రయాణికులు తీసుకున్నట్లు వెల్లడైంది. ఇప్పటికే మెట్రో స్టేషన్లలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని.. దాదాపు 600 మంది భద్రత సిబ్భందిని నియమించామని ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం మెట్రోకి అంతర్జాతీయ స్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. మెట్రో భద్రతా ప్రణాళికను ప్రస్తుత హోంశాఖ సలహాదారు అనురాగశర్మ అధ్యయనం చేశారని.. ఆయన ఆమోదంతోనే ఆ ప్రణాళిక ప్రకారంగా నిఘా వ్యవస్థను రూపొందించామని డీజీపీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టీ సంయుక్త భాగస్వామ్యంతో ప్రారంభమైన మెట్రో ప్రాజెక్టులో భాగంగా... తొలి రైలును ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.