Whatsapp frauds, whatsapp video calls: వాట్సాప్ యాప్‌లో మోసాలకు అంతే లేకుండా పోతోంది. నేరుగా లింక్స్ పంపించి ఆర్థిక మోసాలకు పాల్పడే బ్యాచ్‌లు కొన్ని అయితే, పరోక్షంగా రంగంలోకి దిగి పరిచయం పెంచుకుని, ఆ తర్వాత మోసాలకు తెరతీసే బ్యాచులు ఇంకొన్ని. అలా అపరిచితులుగా పరిచయమై, మోసపూరితమైన మాటలతో నమ్మించి, ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్న ఘటనల్లో తాజాగా మరో కోణం వెలుగుచూసింది.
ఫోన్ చేసి పరిచయం పెంచుకుని, వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి దగ్గరై, ఆ తర్వాత నగ్నంగా కనిపించి రెచ్చగొట్టడం, అవతలి వారి చేత నగ్నంగా వీడియో కాల్ మాట్లాడేలా చేస్తున్న ఓ ముఠా అనంతరం అవే న్యూడ్ వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటోంది. ఈమధ్య కాలంలో ఇలాంటి మోసాలు పెరిగిపోయాయని, అపరిచితులు చేసే ఫోన్ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ ఎక్స్‌పర్ట్స్ (Cyber experts) ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నప్పటికీ.. ఇప్పటికీ జనం మోసపోతూనే ఉన్నారు.
మైలార్‌దేవులపల్లి పరిధిలో తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వారం క్రితం లక్ష్మీగూడలో ఉండే ఇంటర్ విద్యార్థి సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసిన ఓ యువతి.. నీ అందం చూసి పడిపోయానంటూ మూడు గంటలు గలగలా మాట్లాడి పరిచయం పెంచుకుంది. ఆ మరుసటి రోజే వీడియో కాల్ (Video call) చేసిన యువతి.. తల కనిపించకుండా నగ్నంగా కనిపించి నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఏదేదో మాయ మాటలు చెప్పింది. నాకు నువ్వు నగ్నంగా ఉన్న ఫోటో లేదా వీడియో పంపించాలని కోరింది. ఆ యువతి మాటలు నమ్మిన విద్యార్థి ఆమె కోరినట్టుగానే నగ్నంగా తయారై వీడియో కాల్ (Nude video call) చేశాడు.
ఆ తర్వాతే అసలు మోసానికి తెరతీసింది ఆ యువతి. ఆ యువతి స్థానంలో మరో వ్యక్తి మాట్లాడుతూ.. మా అమ్మాయికి నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు పంపిస్తావా అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. మీ ఇంటికి వచ్చి మాట్లాడతా, మీ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు (Police complaint) చేస్తా అంటూ ఆ విద్యార్థిని హెచ్చరించాడు. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న విద్యార్థి.. ఇందులో తన తప్పేమీ లేదని, తమ ఇంటికి రావొద్దని వేడుకున్నాడు. బాధితుడి ముఖంలో భయం చూసిన అవతలి వ్యక్తి.. రూ.20 వేలు ఇస్తే వదిలేస్తానని చెప్పి ఆ డబ్బులు వసూలు చేశాడు.
ఇంటర్ విద్యార్థి మోసపోయిన విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో వాళ్లు మైలార్‌దేవులపల్లి పోలీసులకు ఆశ్రయించారు. అచ్చం ఇదే తరహాలో శాస్త్రిపురానికి చెందిన మరో విద్యార్థి కూడా మోసపోయాడని (Cyber frauds) తెలుసుకున్న పోలీసులు.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అందుకే అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.