హైదరాబాద్‌లోని రాణిగంజ్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాంబే హోటల్‌కి సమీపంలో ఉన్న ఓ పెయింట్స్ గోడౌన్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యవధిలో గోడౌన్ మొత్తానికి వ్యాపించాయి. గోడౌన్ నిండా రంగుల డబ్బాలు నిల్వ చేసి ఉండటంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. మంటల వేడికి రంగుల డబ్బాలు పేలుతుండటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో గంటలతరబడి శ్రమించి మంటల్ని ఆర్పేశారు.
దట్టంగా అలుముకున్న పొగల మధ్య మంటలను అదుపులోకి తీసుకురావడం ఫైర్ సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. ఘటనపై సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి సైతం అక్కడకు చేరుకుని పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ఘటనా స్థలికి సమీపంలోంచే రైలు మార్గం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు కాసేపు ఆ మార్గంలో వచ్చీపోయే రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ఈ ప్రమాదంలో మూడంతస్తుల గోడౌన్ భవనం అగ్నికి ఆహుతైపోయింది.