Minister Harish Rao Comments on Revanth Reddy: రేవంత్ రెడ్డిది వక్ర బుద్ది... వంకర మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయనకి ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు అనే విషయం కూడా తెలియకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని చెబుతూ.. ఒక్క TSPSC ద్వారా మాత్రమే ఉద్యోగాల భర్తీ జరగదని అన్నారు. మీరు చెప్పినట్టే ఒక్క TSPSC ద్వారానే 37 వేల పోస్టులు భర్తీ చేశాం. తాను కూడా అదే చెప్పాను కానీ నీకే అసలు విషయం అర్థం కాక అడ్డం పొడుగు మట్లాడావు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మఠంపల్లిలో జరిగిన బీఆర్ఎస్ సభలో పాల్గొని మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. " తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, విద్యుత్ సంస్థల ద్వారా, డీసీసీబీలు, టీఆర్టీ ద్వారా, గురుకులాల్లో టీచర్ పోస్టులు, తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా డాక్టర్లు, వైద్య సిబ్బంది భర్తీ.. ఇలా వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది " అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పటివరకు 1,32,899 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది అని వివరించిన మంత్రి హరీష్ రావు.. రేవంత్ రెడ్డి.. నీ ఒక్కడికే తెలివి లేదు. ప్రజలందరికీ ఉంది అని ఎద్దేవా చేశారు. మీరు రాజకీయ నిరుద్యోగంలో ఉన్నారు కనుక ఆ ఫ్రస్టేషన్లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
హుజూర్నగర్లో గత ఎన్నికల్లో కంటే ఈసారి 52 వేల ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం అని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తంచేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల వారికి విద్య, ఉపాధి అవకాశాలు లభించి జీవితాలు మెరుగుపడేందుకు అవకాశం లభించింది అన్నారు. గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మఠంపల్లిలో ఐటీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు.
పులిచింతల ప్రాజెక్ట్ సమస్యలు పరిష్కారిస్తాం. మేం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని ఫెయిల్ అయ్యాయా లేక పాస్ అయ్యాయా అనేది కాంగ్రెస్ నేతలు చెప్పాలి. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాం. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. బీజేపీ కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు కానీ తెలంగాణ కు అన్యాయం చేసిన బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు జరుపుతారు అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణకు ఇవ్వాల్సిన హక్కులు, నిధులు ఇచ్చిన తరువాతే తెలంగాణ ఉత్సవాలు జరుపుకోవాలి అని అన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు కేవలం అధికారం మాత్రమే ముఖ్యమని మండిపడిన హరీష్ రావు.. సీఎం కేసీఆర్ కి మాత్రం 4 కోట్ల ప్రజల సంతోషం ముఖ్యం అని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డికి పదవులు కావాలి. మనకి అభివృద్ధి కావాలి. అలాంటప్పుడు ఎవరిని ఎన్నుకోవాలో మీరే నిర్ణయించుకోండి అని సూచించారు.