హైదరాబాద్ : ఎన్నికల సీజన్ ముంచుకొచ్చిన ఈ తరుణంలో ప్రజాశాంతి పార్టీ ఫౌండర్ మరియు చీఫ్ కేఏ పాల్ సడన్ గా మీడియా ముందు ప్రత్యక్ష మయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీట్ల కేటాయింపులో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని..తెలంగాణ ఎన్నికల్లో బీసీ,దళితులకు దక్కిన సీట్లే ఇందుకు నిదర్శనమన్నారు. బడుగు బలహీనవర్గాల వారు అందరూ కలిసి వస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయవచ్చని.. అభ్యర్ధుల తరఫున తాను ప్రచారం చేస్తానని పాల్ చెప్పుకొచ్చారు. తమ పార్టీలో అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యం ఇస్తామని పాల్ తెలిపారు.
రెబల్స్ టచ్ లో ఉన్నారు
తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 3 వేల 500 మంది నామినేషన్లు వేశారని ..ఒక్కో నియోజకవర్గానికి 30 నుంచి 40 మంది పోటీ చేస్తున్నారని పాల్ తెలిపారు. తెలంగాణలోని రెబల్ అభ్యర్థుల్లో చాలా మంది తనను కలిశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి పోటీ చేసేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి క్రైస్తవ మత ప్రచారకుడైన కేఏ పాల్ 2008లో ప్రజా శాంతి పార్టీ స్థాపించారు. 2009 జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఎక్కడా పోటీ చేయలేదు. 2014 లోను ఎక్కడా పోటీ చెయలేదు. అయితే బీసీ రాగంతో ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడం గమనార్హం.
పవన్ పార్టీకి అంత సీన్ లేదు..
ఏపీ రాజకీయాలపై కేఏ పాల్ స్పందిస్తూ ఇక్కడ కూడా ఒక్కో నియోజకవర్గం కోసం 10 మంది అభ్యర్ధులు ఉన్నారు. వారందికి న్యాయం చేసేందుకు ప్రజాశాంతి పార్టీ వేదిక అవుతుందని కేఏ పాల్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్ పార్టీ గురించి అడిగిన ప్రశ్నకు కేఏ పాల్ జనసేన పార్టీపై స్పందించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీలే ప్రధాన భూమిక వహిస్తాయని.. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఆశించినంత మైలేజీ అయితే రావటం లేదని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అభిప్రాయపడ్డారు.