ఇప్పటికే పలు విభిన్నమైన సంక్షేమ పథకాలు, వృద్ధి రేటుతో జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరో గొప్ప ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ప్రతీ ఏటా అందించే ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఈసారి సీఎం కేసీఆర్ ఎంపిక అయ్యారు. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూపు ఎండీ వినీత్ జైన్ ఈమెయిల్ ద్వారా నేరుగా ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. అక్టోబర్ 27న ముంబైలో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని, ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డును స్వీకరించాల్సిందిగా వినీత్ జైన్ సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినీత్ జైన్ ఈమెయిల్‌కి స్పందించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కానున్నట్టు జవాబిచ్చారు. తనకు ఈ అవార్డ్ వ్యక్తిగతంగా లభించలేదని, తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గుర్తింపుగా స్వీకరిస్తున్నానని సీఎం కేసీఆర్ తన మెయిల్‌లో అభిప్రాయపడ్డారు.
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానం సత్ఫలితాలు ఇచ్చిందని, ఇప్పటికే 7000 పరిశ్రమలు ఈ విధానం కింద సునాయసంగా అనుమతులు పొందాయని గుర్తుచేసుకున్న సీఎం కేసీఆర్.. అందువల్లే గత నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రం సగటున ఏడాదికి 17.17 శాతం చొప్పున ఆదాయాభివృద్ది సాధిస్తోందని స్పష్టంచేశారు. ఇతర సంక్షేమ పథకాలలోనూ తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని కేసీఆర్ తేల్చిచెప్పారు.