Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. తొలి రోజు కేవలం ఆరు నిమిషాలు మాత్రమే సభ జరిగింది. ఈ దఫా కేవలం రెండు రోజుల మాత్రం సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. గణేష్ నిమజ్జనాలు, తెలంగాణ విలీన వజ్రోత్సావలు ఉన్నందునే రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజులు సభ జరపడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ రావడానికి భయపడుతున్నారని విమర్శించింది. అసెంబ్లీ సమావేశాలు కుదించడమే కాదు మరో కీలక పరిణామం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ ను ఉద్దేశించి స్పీకర్ మర మనిషిగా వ్యవహరిస్తున్నారని రాజేందర్ అన్నారు. ఈ కామెంట్లనే అదనుగా తీసుకుని అతన్ని సస్పెండ్ చేసేందుకు అధికార పార్టీ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఈటల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రులు స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాజాగా ఈటల రాజేందర్ కు స్పీకర్ కార్యాలయం నోటీసులు వెళ్లాయని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి నడిచారు ఈటల రాజేందర్. కేసీఆర్ తొలి కేబినెట్ లో ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదట కేబినెట్ లోకి తీసుకోలేదు. దీంతో ఈటలను కేసీఆర్ పక్కన పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఏడాది తర్వాత ఈటలను మంత్రివర్గంలో తీసుకుని వైద్య శాఖను అప్పగించారు. కాని పార్టీ కార్యక్రమాల్లో ఈటలను కేసీఆర్ దూరంగానే ఉంచారు. ఏడాది క్రితం భూ కబ్జా ఆరోపణల సాకుతో ఈటలను కేబినెట్ నుంచి తప్పించారు కేసీఆర్. తర్వాత టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల బీజేపీ చేరారు. తర్వాత జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈటల తనకు అసెంబ్లీలో ఎదురుపడకుండా ఉండాలనే కేసీఆర్ అంత కసిగా వ్యవహరించారని అంటారు. అయినా హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల సంచలన విజయం సాధించారు.
హుజురాబాద్ లో తనకు షాకిచ్చిన ఈటల రాజేందర్ అసెంబ్లీలో తనకు ఎదురుపడటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు జరపడం లేదంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఇంతవరకు సభలో ఒక్క రోజు కూడా పూర్తిగా ఉండలేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలిచాక.. గత మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కాని గవర్నర్ ప్రసంగం తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఆ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కేసీఆర్ కు ఎదరుపడలేదు రాజేందర్. ఆరు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. తొలి రోజు ఆరు నిమిషాలు అది కూడా సంతాప తీర్మానాలతోనే ముగిసింది. ఈనెల 12. 13 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. అయితే ఆ రెంజు రోజులు ఈటల సభకు రాకుండా అధికార పార్టీ స్కెచ్ వేసిందని.. స్పీకర్ పై చేసిన కామెంట్లను బూచీగా చూపుతూ సస్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సెషన్ ముగిస్తే మళ్లీ ఫిబ్రవరి, మార్చిలోనే అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ లోపు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళితే సీఎం కేసీఆర్ కు సభలో ఈటల ఎదురపడే అవకాశమే ఉండదు.
మరోవైపు తనను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని చూస్తున్నారన్న వార్తలపై స్పందించారు ఈటల రాజేందర్. స్పీకర్ నాకు తండ్రి లాంటి వారని చెప్పారు. స్పీకర్ ను అధికార పార్టీ నేతలే అగౌరవ పరుస్తున్నారని అన్నారు. ధర్మంగా ఉండే స్పీకర్ ను అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని.. తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ బెదిరింపులకు తాను భయపడబోనని.. చావు కైనా సిద్దపడతానని.. రాజీ పడేది లేదని రాజేందర్ తేల్చి చెప్పారు. అసెంబ్లీలో నా ముఖం చూడవద్దని కేసీఆర్ అనుకుంటే.. ధమ్ముంటే బహిరంగంగా చెప్పాలని సవాల్ చేశారు ఈటల. కేసీఆర్ తో ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని ప్రకటించారు. ప్రజాస్వామ్య ముసుగులో కెసిఆర్ రాచరికపు పాలన చేస్తున్నారని మండిపడిన రాజేందర్.. మునుగోడు ఉప ఎన్నికలో ఆయన తగిన శాస్త్రి జరగడం ఖాయమన్నారు.
Read Also: MLA Jagga Reddy:ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ లో కలవరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook