కెన్నెడి మర్డర్ సీక్రెట్స్ వెల్లడవుతాయా?

  

Last Updated : Oct 22, 2017, 05:31 PM IST
కెన్నెడి మర్డర్ సీక్రెట్స్ వెల్లడవుతాయా?

అమెరికా మాజీ అధ్యక్షుడు మరియు దివంగత నేత జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించిన రహస్య ఫైళ్ళను బహిర్గతం చేస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నవంబరు 22, 1963 తేదీన కెన్నెడి డల్లాస్ ప్రాంతంలో దారుణంగా హత్య చేయబడ్డారు.

ఆ హత్యపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ హత్యకు కారణం లీహార్వే ఆస్వాల్డ్ ఒక్కడేనా లేదా అతనికి తోడు ఇంకెవరైనా ఉన్నారా? అన్న విషయంపై అనేక వార్తాకథనాలు కూడా వెలువడ్డాయి. 1992లో వచ్చిన హాలీవుడ్ చిత్రం "జేఎఫ్‌కే" విడుదలైన తర్వాత ప్రజల అనుమానాలకు ఆ సినిమా మరింత తావిచ్చింది.

ఆ హత్య వెనుక పలు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆ చిత్రం వివరించింది. అయితే ఆ చిత్రం ద్వారా నిజాలు వెల్లడించామని చెప్పలేమని, కెన్నెడి హత్యకు కారణాలు ఏమై ఉంటాయి? అన్న కోణంలో ఆలోచించి ఎవరు హత్య చేసి ఉండవచ్చు అనే ఊహించి మాత్రమే సినిమా తీశామని ఆ సినిమా డైరెక్టరు ఓలివర్ స్టోన్ గతంలో తెలిపారు.  అప్పటి నుండీ నిజనిజాలు తెలపాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఆ నిజనిజాలను తెలిపే డాక్యుమెంట్లు దాదాపు 3000 ఉంటాయని అంచనా. ప్రస్తుతం అమెరికాలోని "నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ లా" ఆధ్వర్యంలో ఆ ఫైళ్ళు భద్రపరచబడి ఉన్నాయి. చక్ గ్రాస్లే లాంటి  అమెరికా నాయకులు కూడా ఈ విషయంపై మాట్లాడారు. ఆ ఫైళ్ళను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 

Trending News