AP 10th class exams schedule: అమరావతి: ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జూన్ 7వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని, ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులుచేర్పులు లేవని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు. శనివారం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణ కోసం యధావిధిగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. పరీక్షలు మళ్లీ వాయిదా పడతాయంటూ కొంత మంది ప్రచారం చేస్తున్నారని.. కానీ ఆ ప్రచారంలో నిజం లేదనిమంత్రి సురేష్ తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేకుండా అనుకున్న సమయంలో పరీక్షలు పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిపారు. అప్పటిలోగా కరోనా కేసులు తగ్గి పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పిన ఆయన.. ఏదేమైనా ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో కానీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అప్పటి పరిస్థితులనుబట్టి నిర్ణయం తీసుకుంటారని, అప్పటివరకు షెడ్యూల్ విషయంలో మార్పులు ఉండబోవని తేల్చిచెప్పారు.
విద్యార్థులకు మంచి ఆరోగ్యంతోపాటు మంచి భవిష్యత్ కూడా అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రస్తుతానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అనుకున్న షెడ్యూల్‌కే పరీక్షలు (AP 10th class exams 2021 schedule) నిర్వహించాలని అనుకుంటున్నందున విద్యార్థులు ఆ ప్రకారమే పరీక్షలకు సన్నద్ధం కావాల్సి ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) విద్యార్థులకు సూచించారు.