పదవీ విరమణ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ రంజన్ గొగొయ్

పదవీ విరమణ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ రంజన్ గొగొయ్

Last Updated : Nov 17, 2019, 01:14 PM IST
పదవీ విరమణ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ రంజన్ గొగొయ్

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నవంబర్ 17న పదవి విరమణ పొందనున్న నేపథ్యంలో శనివారమే తిరుమల చేరుకున్న ఆయన సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మగారిని, ఆ తర్వాత వరాహ స్వామిని దర్శించుకున్న అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారి అలంకరణ మొదలు.. అక్కడి స్థల పురాణం, ప్రత్యేకతలను ప్రధాన న్యాయమూర్తికి వివరించిన వేదపండితులు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ సీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఈవో ధర్మా రెడ్డి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. 

రంజన్ గొగొయ్ ఆదివారం పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో బార్ అసోసియేషన్ ఆయనకు చివరి పని దినమైన శుక్రవారమే ఘనంగా వీడ్కోలు పలికింది. చివరి పనిదినం నాడు సైతం ఆయన కోర్టులో విచారణకు వచ్చిన 10 కేసుల్లో సంబంధిత పార్టీలకు నోటీసులు జారీచేశారు. 2018, అక్టోబర్ 3న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రంజన్ గొగొయ్.. తన పదవీ కాలంలో ఎన్నో కీలక కేసుల్లో తీర్పు వెల్లడించారు. అందులో అయోధ్య స్థల వివాదం, రాఫెల్ డీల్, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, అస్సాం ఎన్ఆర్సీ వంటివి ఆయన హయాంలో తీర్పు లభించినవే కావడం విశేషం. రంజన్ గొగొయ్ అనంతరం సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అరవింద్ బాబ్డే బాధ్యతలు చేపట్టనున్నారు.

Trending News