కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో భారీగా గుప్త నిధులు దాగి వున్నాయనే అనుమానంతో గత నెలరోజులుగా పురాతత్వ శాస్త్రవేత్తల విభాగం అధికారులు అక్కడ తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. రేయింబవళ్లు జరుగుతున్న ఈ తవ్వకాల్లో ఎప్పుడు, ఎటువంటి దృశ్యం వెలుగుచూడనుందా అనేంత ఉత్కంఠ కనిపించింది. ముఖ్యంగా అధికారులు తవ్వకాలు జరుపుతున్న బావిలో ఓ సొరంగ మార్గం వెలుగుచూడటంతో ఇక్కడ గుప్తనిధులు దాగి వున్నాయనే వాదనకి మరింత బలం చేకూరింది. ఈ తవ్వకాల కోసం అధునాతమైన యంత్ర పరికరాలు, పరిజ్ఞానం వినియోగించారు. గుప్తనిధుల కోసం తవ్వకాల విషయమై స్థానికులు, సంబంధిత అధికారుల మధ్య విభేదాలు కూడా తలెత్తాయి. తవ్వకాల్లో బయటపడే సంపదలో కొంత గ్రామాభివృద్ధికి వెచ్చించడం జరుగుతుందనే ఒప్పందంతో ఈ తవ్వకాలు జరిగినట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, ఇక్కడ గుప్తనిధులు లభిస్తాయని ఆశించిన అధికారులకి గుప్త నిధులు దొరకలేదు కానీ ఇక్కడి నేలలో అపారమైన ఖనిజ సంపద దాగి వున్నట్టు గుర్తించారు. తవ్వకాలలో భారీ ఖనిజ సంపదకు సంబంధించిన ఆనవాళ్లు వెలుగుచూసినట్టు మైనింగ్ శాఖ ఏడీ నటరాజన్ స్పష్టంచేశారు. ఇక్కడ లభ్యమయ్యే ఖనిజాల విలువ కోట్ల రూపాయలలోనే వుంటుందని మైనింగ్ శాఖ చెబుతోంది. గుప్తనిధులు లభిస్తాయని ఆశించి భంగపడిన వారికి చివరకు అపారమైన ఖనిజ సంపద వుందని తేలడం కొంత ఊరటనిచ్చిందనే అభిప్రాయం వినిపిస్తోంది.