కర్నూలు: ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అనంతపురంలో కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. స్వయంగా పవన్ కల్యాణ్ హాజరవడంతో ఈ కవాతుకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. అలా సభకు హాజరైన కార్యకర్తలు కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా కర్నూలు జిల్లా డోన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారు, ఓ ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు కార్యకర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదం గురించి సమాచారం అందుకున్న పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, అభిమాన సంఘాల నాయకులతో ఫోన్లో మాట్లాడి ఘటన జరిగిన తీరుతెన్నులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మృతులను వెల్దుర్తి మండలం గోవర్ధనగిరికి చెందిన హనుమన్న, గోవిందు, డోన్ మండలం ధర్మవరానికి చెందిన మధుగా గుర్తించారు. కడపటి వార్తలు అందే సమయానికి మరో మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. కారు డ్రైవర్ మల్లికార్జున తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జనసేన పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు పవన్ కల్యాణ్ నిర్వహించిన కవాతు సక్సెస్ అయ్యిందన్న ఆనందం ఎంతోసేపు లేకుండా చేసింది ఈ దుర్ఘటన.