పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులను హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఘర్షణలు పడకుండా ఉండాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులను హెచ్చరించారు. విభేదాలు, ఈగోలను పక్కనపెట్టి సమిష్టిగా పనిచేయాలని పవన్ సూచించారు.
నెల్లూరులో రొట్టెల పండగకు హాజరైన పవన్ కళ్యాణ్, అక్కడ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ.. స్థానిక సమావేశాల్లో అభిమానులు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదు చేయగా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ, అభిమానులు సమన్వయంతో కలిసి పనిచేసుకొని పోవాలని, క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. ప్లెక్సీలు, కటౌట్‌లను ఏర్పాటు చేసేటప్పుడు పార్టీ కార్యకర్తలు ఘర్షణలకు దిగడం మంచిది కాదని కోరారు.
నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ పర్యటన
పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం నుంచి పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా ఇవాళ ప్రజా సంఘాలతో పవన్ కల్యాణ్ భేటీ కానుండగా.. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది.
ఏలూరులో మీడియాతో మాట్లాడిన జనసేనాని.. అక్రమ మైనింగ్‌పై జనసేన పార్టీ ప్రశ్నించినప్పుడే ప్రభుత్వం స్పందించి ఉంటే అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలు జరిగి ఉండేవి కాదన్నారు. ప్రణయ్ హత్యపై సోషల్ మీడియాలో యువత సంయమనం పాటించాలని కోరారు.