Botsa Satyanarayana On Skill Development Scam: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అంతా ప్రజలకు తెలుసని అన్నారు. చంద్రబాబు వర్చువల్ విచారణలో ఏసీబీ జడ్జి ముందు ఆవేదన చెందారని.. తాను నీతిమంతుడిని అని చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో నిబంనధనలు అతిక్రమించారని.. కానీ ఎప్పుడూ దొరకలేదన్నారు. ఇప్పుడు దొరికి దొంగ అయ్యారని.. అందుకే ఆయన బేలగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆ రోజు చేసుకున్న ఒప్పందం గురించి ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వాటా రూ.371 కోట్లు ఇచ్చారని.. కానీ సీమెన్స్ కంపెనీ తన వాటాగా ఇవ్వాల్సిన దాదాపు రూ.3 వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు..? అని నిలదీశారు.
"మేము సీమెన్స్ కంపెనీ మంచిది కాదని చెప్పడం లేదు. ఆ కంపెనీని తప్పు పట్టడం లేదు. కానీ మీరు ఆ కంపెనీతో ముందు చేసుకున్న ఒప్పందం ఏమైంది..? ఆ కంపెనీ ఎందుకు పెట్టుబడి పెట్టలేదని మాత్రమే అడుగుతున్నాం. సీమెన్స్ కంపెనీ గుజరాత్‌లో ఒప్పందం చేసుకుని, స్కిల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీ చేసింది. కానీ అందుకు చాలా తక్కువ పెట్టుబడి పెట్టారు. అక్కడ సాఫ్ట్‌వేర్ ఇచ్చారు. పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ సీమెన్స్ కంపెనీ ఏ పనీ చేయలేదు. వారు పెట్టాల్సిన పెట్టుబడి పెట్టలేదు.
నిన్న తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. కారణం చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఒక నాయకుడు అలా మాట్లాడొచ్చా..? అందుకే మేము పోచారం మాటలను ఖండిస్తున్నాం. చంద్రబాబు తప్పు చేయలేదని ఆయన అనుకుంటే.. ఆ విషయాన్ని తెలంగాణ సీఎంతో మాట్లాడాలి. మా ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా.. చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఎక్కడ, ఏ అవకతవకలు జరిగినట్లు తెలిసినా, ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం.
ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయం ఉంటే.. వారు బాధ్యులై ఉంటే.. చర్యలు ఉంటాయి. ఈ క్షణం వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో.. వారికి ప్రమేయం ఉందని తెలిస్తే.. చర్యలు తీసుకుంటాం. కానీ, ఆ రోజు అధికారులు చాలా స్పష్టంగా రాశారు. నిధులు విడుదల చేయొద్దని రాశారు. అయినా అప్పటి సీఎం ఆదేశాల మేరకు నిధులు విడుదల చేశారు. అదే విషయాన్ని వారు స్వయంగా నోట్‌లో రాశారు. మాకు ఎవరిపైనా ప్రేమ లేదు. ద్వేషం లేదు. ఎవరైనా తప్పు చేస్తే, చర్యలు తీసుకుంటాం. మాకు ఎవరైనా ఒకటే. ఒప్పందంలో స్పష్టత లేదని, కాబట్టి ప్రభుత్వం నిధులు విడుదల చేయొద్దని అప్పటి అధికారులు కోరారు. అయినా, అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.371 కోట్లు ఇచ్చారు.." అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Also Read: PRSI National Awards: ఐటీ శాఖ తెలంగాణ డిజిటల్ మీడియా విభాగానికి అవార్డుల పంట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి