Tadipatri TDP incharge JC Ashmit Reddy : తాడిపత్రిలో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ అష్మిత్ రెడ్డి 3వ వార్డులో పర్యటించడాన్ని అక్కడి స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారు. తమ వార్డులో అష్మిత్ రెడ్డి పర్యటించడానికి వీల్లేదంటూ స్థానిక కౌన్సిలర్ వర్గీయులు హెచ్చరించారు. అయితే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఎవరైనా, ఎక్కడైనా వెళ్లవచ్చని వైసీపీ నేతలకు హితవు పలికిన అష్మిత్ రెడ్డి.. వైసీపీ నేతల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అక్కడికి వెళ్లారు. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, 3వ వార్డులో పర్యటనకు వచ్చిన అష్మిత్ రెడ్డితో పాటు టీడీపీ నేతల బృందంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
స్థానిక వైసీపీ నాయకుడు, కౌన్సిలర్ కి చెందిన బీడీ పరిశ్రమ భవనం పై నుంచే రాళ్లు విసిరారు అని అష్మిత్ రెడ్డి ఆరోపించారు. తమ పర్యటన ఇష్టం లేని వైసీపీ నాయకులే తమపై రాళ్ల దాడి చేయించారని.. ఇది ముమ్మాటికీ స్థానిక వైసీపీ నేతల పనే అని అష్మిత్ రెడ్డి మండిపడ్డారు. పథకం ప్రకారం దాడి చేశారు కనుకే దాడి జరిగిన ప్రాంతంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఇది ప్లాన్ ప్రకారం చేయకపోతే అంతటా ఉన్న కరెంట్ సరఫరా కేవలం దాడి జరిగిన ప్రాంతంలోనే ఎలా నిలిచిపోయిందని ప్రభుత్వాన్ని, స్థానిక వైసీపీ నేతలను నిలదీశారు.
తన కుమారుడు, స్థానిక టీడీపీ ఇంచార్జ్ అష్మిత్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటనపై సమాచారం అందుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే వైసీపీ నాయకులు ఇలా చాటుగా ఉండి రాళ్ల దాడికి పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అష్మిత్ రెడ్డి, టీడీపీ నేతలపై రాళ్లదాడిని పిరికిపందల చర్యగా జేసీ ప్రభాకర్ రెడ్డి అభివర్ణించారు.
ఏపీలో వైసిపి అధికారంలోకి రావడంతోనే రౌడీల రాజ్యం వచ్చిందన్న జేసి ప్రభాకర్ రెడ్డి... రాష్ట్రంలో వీధికో రౌడీ తయారయ్యారు అని ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఏపీలో పోలీసులు కూడా అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలకే అండగా నిలిచి వారి దాడులను సమర్థిస్తున్నారని మండిపడ్డారు. అష్మిత్ రెడ్డిపై రాళ్లదాడి, జేసి ప్రభాకర్ రెడ్డి రాకతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.