Go First Insolvency : గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేయడం ఇండియాలో ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపింది. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ ఇన్‌సాల్వెన్సీతో భారత్‌లో విమానయానం మరింత ఖరీదుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ ఏయే రూట్లలోనైతే ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తుందో.. ఆయా రూట్లలో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న మిగతా ఎయిర్‌లైన్స్ విమానాల్లో టికెట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానాలు రద్దవడంతో ఆయా రూట్లలో ఉన్నట్టుండి భారీ డిమాండ్ పెరిగింది. దీంతో ఇదే అదనుగా ఆ రద్దీని క్యాష్ చేసుకునేందుకు ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు అమాంతం ధరలు పెంచేశాయి. కొన్ని రూట్లలో నిన్నమొన్నటి కంటే 50 శాతం వరకు ధరలు పెరిగాయంటే.. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రభావం ఎంత అధికంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ ఇండియాలో రన్ అవుతున్న టాప్ 5 ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా సంస్థల తరువాతి స్థానం గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌దే కావడం గమనార్హం. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థ నిత్యం 200 విమానాలు ఆపరేట్ చేస్తోంది. అయితే, ఆ సంస్థకు చెందిన విమానాలన్నీ మే 12 వరకు రద్దు కావడంతో ఆ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయ విమానాయన సంస్థలను వెదుక్కోవాల్సి వచ్చింది. ఈ కారణంగానే టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.
ఉదాహరణకు ఢిల్లీ నుంచి లేహ్ రూట్‌లో గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థకు బాగా పట్టుంది. ఈ మార్గంలో 7 రోజులు ముందుగా విమానం టికెట్ బుక్ చేసుకుంటే రాకపోకలకు కలిపి రూ. 20 - 25 వేల లోపే అయ్యేది. కానీ ఆ సంస్థ విమానాలు రద్దు కావడంతో ఈ నెల ఆఖరు తేదీలలో ఆ మార్గంలో ఉన్న విమానాల టికెట్ బుక్ చేసుకోవాలని మేక్ మై ట్రిప్ లాంటి థర్డ్ పార్టీ వెబ్‌సైట్లో పరిశీలించగా.. రూ. 37 వేల వరకు విమానం టికెట్ ధరలు చూపిస్తోంది.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించిన వివరాల ప్రకారం గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ విమానాలు రద్దయ్యే వరకు 35 కి పైగా మార్గాల్లో 90 శాతం ప్రయాణికుల రద్దీతో విమానాలు రాకపోకలు సాగించాయని తెలుస్తోంది. ఇప్పుడు ఆ రద్దీ మొత్తం ఇతర విమానాయాన సంస్థలపై స్పష్టంగా కనిపిస్తోంది. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థ నష్టాల బారిన పడటంతో అందివచ్చిన ఈ అవకాశాన్ని ఇతర విమానయాన సంస్థలు సొమ్ము చేసుకుంటున్నట్టు ప్రస్తుత సరళి చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది.
Go First Insolvency: భారీగా పెరిగిన విమానం చార్జీలు.. మరింత ఖరీదైన విమానయానం