LPG Cylinder Price in Hyderabad: బీజేపి నేతృత్వంలోని కేంద్రం పలు మెట్రో నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్టు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. కమెర్షియల్ సిలిండర్ ధరను రూ. 350 మేర పెంచిన కేంద్రం.. డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ. 50 మేర పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు రూ 1000 మార్క్ క్రాస్ చేశాయి. పెరిగిన ధరలు సామాన్యులపై మరింత ఆర్థిక భారాన్ని పెంచాయంటూ ప్రతిపక్షాలు, జనం రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేపట్టారు.
ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధరలను బేరీజు వేయగా.. ఒక మెట్రో సిటీలో గృహ సంబంధిత అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు భారీగా పెరిగినట్టు కనిపించాయి. ఆ ఒక్క మెట్రో సిటీ మరేదో కాదు.. మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే ఎల్పీజీ సిలిండర్ ధర అత్యధికంగా ఉన్నట్టు తాజాగా వెల్లడైన గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎల్‌పిజి సిలిండర్ ధరలు రూ.1150 దాటడం గమనార్హం.
అవును.. హైదరాబాద్ లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1155 కాగా, కమెర్షియల్ సిలిండర్ ధర రూ. 2325 గా ఉంది. హైదరాబాద్ తరువాత ఎల్పీజీ సిలిండర్ ధరలు అధికంగా ఉన్న రెండో నగరంగా కోల్‌కతా ఉన్నట్టు తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. అత్యధిక ధర నుంచి తక్కువ ధర ఉన్న మెట్రో నగరాల జాబితా ఇలా ఉంది.
హైదరాబాద్ - రూ 1155
కోల్‌కతా - రూ 1129
చెన్నై - రూ 1118.5
బెంగళూరు - రూ 1105.5
ఢిల్లీ రూ 1103