Nizamabad Family Suicide: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హోటల్ గదిలో విగతజీవులుగా కనిపించారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదిలాబాద్‌కి చెందిన వ్యాపారి కొత్తకొండ సూర్యప్రకాశ్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. మృతులను సూర్య ప్రకాశ్ (37), అతని భార్య అక్షయ (36), కూతురు ప్రత్యూష (13), అద్వైత్ (10)లుగా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్‌నర్స్ వేధింపులే కుటుంబం ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నివాసముండే కొత్తకొండ సూర్యప్రకాష్ స్థానికంగా హార్డ్ వేర్ షాపుతో పాటు పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా మంచి స్థితికి ఎదగడంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు.
హైదరాబాద్ వచ్చాక సూర్యప్రకాశ్ కొంతమంది పార్ట్‌నర్స్‌తో కలిసి శంకరంపేటలో రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభించారు. ఇందుకోసం భారీగా డబ్బు పెట్టుబడి పెట్టారు. అది సరిపోక అప్పులు కూడా చేశారు. అదే సమయంలో పార్ట్‌నర్స్ నుంచి వేధింపులు మొదలయ్యాయి. వెంచర్‌లో మరింత పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. సూర్యప్రకాశ్ ఇంటికెళ్లి అతనిపై, అతని ఫ్యామిలీపై దాడి చేశారు. దీంతో సూర్యప్రకాశ్ తీవ్ర మనస్తాపం చెందాడు.
ఇదే క్రమంలో ఈ నెల 4న సూర్యప్రకాశ్ ఫ్యామిలీని తీసుకుని నిజామాబాద్ వెళ్లాడు. అక్కడ ఓ స్థానిక హోటల్లో దిగారు. ఆదివారం (ఆగస్టు 21) ఉదయం చాలాసేపటి వరకు ఆ ఫ్యామిలీ హోటల్ గది నుంచి బయటకు రాలేదు. హోటల్ సిబ్బంది ఎన్నిసార్లు తలుపు తట్టినా లాభం లేకపోయింది. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించారు. గదిలో సూర్యప్రకాశ్ ఉరివేసుకుని కనిపించగా అతని భార్య, పిల్లలు విగతజీవులుగా పడి ఉండటం గమనించారు.
సూర్యప్రకాశ్ మొదట తన భార్య, పిల్లలకు కేకులో విషం కలిపి తినిపించి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మొదట తానొక్కడే చనిపోవాలని సూర్యప్రకాశ్ భావించినప్పటికీ... బిజినెస్ పార్ట్‌నర్స్ ఫ్యామిలీని కూడా వేధిస్తారని భయపడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సూర్యప్రకాశ్ ఫ్యామిలీని వేధించిన అతని బిజినెస్ పార్ట్‌నర్స్ గురించి ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.
Also Read: Megastar Chiranjeevi Birthday Special: మొగల్తూరు టు ఫిలింనగర్.. స్వయంకృషే పెట్టుబడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook