డిసెంబరు 31న రాత్రి హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పోలీసులు జరిపిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం మత్తులో కారు నడుపుతూ పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం పరారీలో వున్నాడని బుధవారమే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ గురువారం కూడా ప్రదీప్ తమ ఎదుట హాజరు కానట్లయితే, కేసు లా అండ్ ఆర్డర్ పోలీసుల వరకు వెళ్తుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు చేసిన ప్రకటనతో 'ప్రముఖ యాంకర్ ప్రదీప్ పరారీలో వున్నాడట' అనే ప్రచారం ఊపందుకుంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై స్పందించిన ప్రదీప్.. తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో కారు నడపడం తప్పేనని అంగీకరించిన ప్రదీప్.. తాను చేసిన తప్పుని మరెవ్వరూ చేయవద్దంటూ ఆ వీడియోలో విజ్ఞప్తిచేశాడు. తాను పరారీలో వున్నాననే ప్రచారంలో నిజం లేదు. కేవలం ముందస్తుంగా అంగీకరించిన కార్యక్రమాలు, ఈవెంట్లకి హాజరు కావాల్సి వున్న కారణంగానే తాను పోలీసుల ఎదుట హాజరుకాలేకపోయానే తప్పితే ఇందులో తనకు ఇంకే దురుద్దేశం లేదని ప్రదీప్ ఈ వీడియోలో పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్లో యాంకర్ ప్రదీప్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో అతడు ఇంకా ఏమేం చెప్పాడో మీరే ఈ వీడియోలో చూడండి!
<
>