'పద్మావతి' సినిమా రోజుకో మలుపు తిరుగుతోంది. బాలీవూడ్ లో ఇదే ఇప్పుడు టాప్ న్యూస్. ఆదివారం సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ పై కర్ణిసేన మరోసారి విరుచుకుపడింది. 'పద్మావతి' సినిమా వాయిదా నిర్ణయం ప్రజల్ని మోసగించడమే అని స్పష్టం చేసింది. రాజ్ పుత్ కర్ణిసేన నాయకుడు లోకేన్సరా సింగ్ కల్వి ఈ సినిమా నిర్మాణానికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి రహస్యంగా నిధులు అందాయని తెలిపారు. ఈ సినిమాను అడ్డుకుంటున్నందుకు నాకు కరాచీ నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని అన్నారు. సినిమా విడుదల వాయిదా తాత్కాలికమే అని..ఇదంతా ఒక పన్నాగం ప్రకారమే జరుగుతోందని వ్యాఖ్యానించారు.
కాగా, ఆంతకు ముందు డిసెంబర్ 1న విడుదల కావాల్సిన 'పద్మావతి'సినిమా విడుదలను వివాదాల నేపథ్యంలో విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ఆదివారం ప్రకటించింది. ఈ వ్యవహారం కొలిక్కి వచ్చాకే సినిమా విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. తాజాగా దీపికా, భన్సాలీ తల రేటు 10 కోట్లకు పలికింది. హర్యానాకు చెందిన బిజెపి నేత ఒకరు 'పద్మావతి' సినిమాలో కీలకపాత్ర పోషించిన దీపికా పదుకొనె, డైరెక్టర్ భన్సాలీల తల నరికితే 10 కోట్లు ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వారిద్దరి తలలకు 5 కోట్లు ఇస్తానని చెప్పిన మీరట్ యువకుడిని తాను అభినందిస్తున్నానని బీజేపీ నాయకుడు సూరజ్ పాల్ ఆము తెలిపారు.