అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిన్న జరిగిన చర్చలో ప్రధాని మోదీ వద్దకు వెళ్లి రాహుల్ కౌగిలించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన తనవారికి కన్ను కొట్టడంతో సభలో నవ్వులు విరిశాయి. అయితే చాలామంది రాజకీయ ప్రముఖులు ఈ ఘటనలో రాహుల్ చేసిన పనిని పిల్ల చేష్టగా కొట్టి పారేశారు. బీజేపీ నేతలు కొందరు ఆయన పై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విమర్శలు కూడా చేశారు. ప్రధాని మోదీ కూడా మాట్లాడుతూ.. రాహుల్ చేసిన పని తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు.
ప్రధాని పీఠం అధిరోహించాలని రాహుల్‌కు చాలా కోరికగా ఉందని.. అందుకే చాలా గాభరాగా వచ్చి తనను కౌగిలించుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ సంఘటన జరిగాక.. ప్రసార సాధనాలన్నీ ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. రాహుల్ కన్ను కొట్టడాన్ని.. ప్రియాంక వారియర్ కన్నుగీటిన సంఘటనతో పోల్చాయి. రాహుల్ పై అనేక సోషల్ మీడియా మేమ్స్‌తో పాటు సెటైరికల్ పోస్టులు వెల్లువెత్తాయి. రాహుల్ చేసిన పనిని స్పీకరు కూడా తప్పుపట్టారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా ప్రవర్తించాలని ఆమె అన్నారు.
రాహుల్ గాంధీ చర్యపై ప్రముఖ పాల తయారీ సంస్థ "అమూల్" కూడా ఒక కార్టూన్ ప్రకటనను రూపొందించింది. ఈ ప్రకటనలో ఆ కౌగిలింతపై "ప్రేమను పంచేదా లేదా ఇబ్బంది పెట్టేదా" అనే ప్రశ్నను లేవనెత్తుతూ క్యాప్షన్ పెట్టడం గమనార్హం. తాజా ఘటనలపై ఎప్పటికప్పుడు సెటైరికల్ కార్టూన్స్ రూపొందించే అమూల్ ఈసారి కూడా రాహుల్ కౌగిలింతపై మంచి ఛలోక్తినే విసిరింది. తాజాగా విడుదలైన ఈ అమూల్ కార్టూన్‌ను నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.