బీజేపీ వ్యతిరేక ఉద్యమం మరింత ఊపందుకోనుంది. బీజేపీ ఓటమే లక్ష్యంగా పీడీపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అడుగులు వేస్తున్నాయి. కూటమిగా ఏర్పడి జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేయాలనే అంశంపై ఈ మూడు పార్టీల మధ్య సంప్రదింపులు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో గవర్నర్ పాలన కొనసాగుతోంది. డిసెంబర్ 19న గవర్నర్ పాలన ముగియనుంది. తదుపరి ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
ఇటీవలె జరిగిన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతో జూన్ 16న సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చింది. దీంతో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేనందున అక్కడ గవర్నర్ పాలన విధించారు. ఇలా సీఎం పీడీపీ అధికారానికి దూరమైంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజా కూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పీడీపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ముందుకు వస్తున్నాయి.
ఇటీవలె యూపీలో కూడా బీజేపీని ఓడించేందుకు బద్ధశత్రువలైన ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీకి పరోక్ష మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో చిరకాలశత్రువులైన కాంగ్రెస్ , టీడీపీ జతకట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూడా కాంగ్రెస్ తో జతకట్టేందుకు ముందుకు రావడం..ఇది బీజేపీయేతర కూటమికి మరింత బలం చేకూరినట్లయింది.