హర్యానా ప్రాంతంలో జరిగిన పంచకుల అల్లర్ల వెనుక తన హస్తం ఉందని, డేరాబాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకుంది. డేరాకి సంబంధించిన పలువురు వ్యక్తుల సహాయంతో ఆ అల్లర్లు జరగడానికి తానే రోడ్ మ్యాపులు డిజైన్ చేసినట్లు హనీప్రీత్ తెలిపింది. అయితే గతంలో ఆ అల్లర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన హనీప్రీత్, విచారణ తర్వాత నిజం ఒప్పుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. హరియాణాకి చెందిన ప్రత్యేక పోలీసుల టీమ్ హనీప్రీత్‌ను విచారించాక ఈ నిజాలు బయటకు వచ్చాయి. ఈ అల్లర్ల వెనుక ఉన్న ప్రధాన హస్తం హనీప్రీతేనని డేరా అనుచరులు కొందరు ఇదివరకే పోలీసులకు సాక్ష్యం ఇచ్చిన నేపథ్యంలో.. విచారణ తర్వాత ఆమె తానే సూత్రధారినన్న నిజాన్ని అంగీకరించింది. తన అజమాయిషీలోనే ఈ ఘటనకు సంబంధించి దాదాపు 1.25 కోట్ల రూపాయలు చేతులు మారాయని కూడా ఆమె అంగీకరించారు. హనీప్రీత్ స్టేట్ మెంటును రికార్డు చేసి పోలీసులు, విషయాన్ని బహిర్గతం చేశారు. ఇద్దరు సాధ్వీలను అమానీయమైన రీతిలో అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిదే. ఆ శిక్షను విధించిన క్రమంలోనే పంచకులలో అల్లర్లు చెలరేగి 30 మంది బలయ్యారు. ఈ కేసుకు సంబంధించే గత వారం హనీప్రీత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.