ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలోనే సురక్షితంగా కిందకు దిగిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. జీ బిజినెస్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం గో ఎయిర్ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన G8 423 విమానం ఉదయం 7:20 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరింది. ఆ సమయంలో విమానంలో 90 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాల్లో ఉండగా, ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించిన పైలట్.. ఢిల్లీ ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్)కి సమాచారం అందించారు. ఏటీసీ సూచనల మేరకు తిరిగి ఢిల్లీలోనే సురక్షితంగా విమానాన్ని కిందకు దించారు.
ఇంకొద్దిసేపట్లో హైదరాబాద్ చేరుకుంటాం కదా అని భావించిన ప్రయాణికులకు ఈ అనుకోని పరిణామం షాక్‌కి గురిచేసింది. అయితే, ప్రయాణికులకు సర్దిచెప్పిన సదరు ఎయిర్ లైన్స్ సంస్థ.. ఆ విమానం నుంచి ర్యాంప్ ద్వారా నేరుగా మరో విమానంలోకి ఎక్కించి తిరిగి హైదరాబాద్ పంపించింది. ఆ తర్వాత G8 423 విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను గుర్తించి మరమ్మతులు చేసినట్టు సంస్థ తెలిపినట్టుగా జీ బిజినెస్ వార్తా కథనం స్పష్టంచేసింది.
హైదరాబాద్ బయల్దేరిన ప్రయాణికులను మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లిన విమానం!