చెన్నై: రానున్న 2019 లోక్ సభ ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ స్పష్టంచేశారు. ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో అనేక ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి కమల్ హాసన్ రాజకీయ పార్టీ స్థాపించడం. గత కొన్నేళ్లుగా పార్టీ పెట్టడంపై తర్జనబర్జనలు పడుతూ వస్తున్న కమల్ హాసన్ ఎట్టకేలకు తన అభిమాన సంఘాలతో భేటీ అనంతరం ఈ ఏడాదిలోనే ఫిబ్రవరి 22న మక్కల్ నీధి మయ్యం పేరిట రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి తన పార్టీ జండా, లోగోను కూడా ఆవిష్కరించారు. తాజాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో తానే ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు కమల్ హాసన్ తేల్చిచెప్పారు.
అదే ఆఖరి చిత్రం:
రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్న కమల్ హాసన్.. భారతీయుడు 2 సినిమానే తన ఆఖరి చిత్రం అవుతుందని ఇటీవలే ప్రకటించి సంచలనం సృష్టించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా జీవితంలోకి వెళ్లాలనే ఆలోచనతోనే ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించి వుంటారని కమల్ ఫ్యాన్స్, పరిశీలకులు భావిస్తున్నారు.