ముంబై: ''తాను ఓ సిట్టింగ్ ఎంపీని అయినప్పటికీ.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ నుంచి తాను తీవ్రస్థాయిలో బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది'' అని ప్రముఖ సినీ నటి, ఎంపీ జయప్రద ఆరోపించారు. ''అమర్ సింగ్ తనకు గాడ్ ఫాదర్ లాంటి వారని, తాను ఆయనకు రాఖీ కట్టినా.. జనం మాత్రం తమ గురించి చెడుగా చెప్పుకోవడం మాత్రం మానరు'' అని ఆవేదన వ్యక్తం చేశారామె. ముంబైలో జరిగిన క్వీన్స్‌లైన్ లిటరేచర్ ఫెస్టివల్లో రచయిత రామ్ కమల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాంపూర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్ తనపై యాసిడ్ దాడికి ప్రయత్నించారని, తన కష్టాల గురించి చెప్పుకున్నప్పుడు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా తనకు అండగా నిలవలేదని జయప్రద తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. తన మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు తాను కష్టాల్లో ఉన్నానంటే ములాయం సింగ్ గారు కనీసం ఓ ఫోన్ కాల్ కూడా చేసి పరామర్శించలేదని, అటువంటి సమయంలో డయాలసిస్ చికిత్స పొందుతున్న అమర్ సింగ్ గారే మళ్లీ తనకు ధైర్యం చెప్పి మద్దతుగా నిలిచారని జయప్రద తెలిపారు.