న్యూఢిల్లీ: ప్రజలకు, ముఖ్యంగా అన్నదాతకు చల్లని కబురు. ఈ ఏడాది మంచిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ ప్రకటించింది. జూన్ మొదటివారంలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించి రైతులను సంతోషపెడతాయని తెలిపింది. సోమవారం న్యూఢిల్లిలో భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కె.జె.రమేష్ ఈ ఏడాది వర్షపాతం వివరాలను వెల్లడించారు.
తమ వాతావరణ శాఖ పరిశోధనల అంచనాల మేరకు ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని అన్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు బాగా కురుస్తాయని వివరించారు. ఈ సారి వర్షపాతం జూన్- సెప్టెంబర్ మధ్య 96-104 మధ్య ఉంటుందని ఐఎండి అంచనా వేసిందన్నారు. సాధారణం నుంచి ఎక్కువ వర్షపాతం అంచనాలు 56 శాతం, సాధారణం కంటే తక్కువ నుంచి లోటు వర్షపాతం 44శాతం ఉన్నట్లు వెల్లడించారు. రైతాంగానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఏ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుందో జూన్లో చెప్తామన్నారు. ఈసారి ఎల్నినో ప్రభావమేమీ లేదన్నారు.
వర్షపాతం 90 శాతానికి దిగువన ఉంటే లోటు వర్షపాతంగా, 105-110 మధ్య ఉంటే సాధారణం కంటే ఎక్కువగా, 110 శాతానికి పైగా ఉంటే అతి ఎక్కువ వర్షపాతంగా పరిగణిస్తుంది భారత వాతావరణ శాఖ.
మరోవైపు నైరుతి రుతుపవనాలు జూన్ మొదటివారంలో కేరళను తాకుతాయని, తెలుగు రాష్ట్రాల్లోనూ గత ఏడాది మాదిరిగానే మంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు. 97శాతం ఖచ్చితత్వంతో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని చెప్పడం రైతాంగానికి నిజంగా శుభవార్తే.