న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగం అంటే హాయిగా ఎంజాయ్ చేస్తూ పనిచేసుకోవచ్చు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు తీసుకోవచ్చనే అపోహలు వున్న సమాజంలోనే ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకుంటూ రోజుకూ 12 గంటలకుపైనే పనిచేస్తున్నప్పటికీ సెలవులు కానీ లేదా కనీసం వారంలో ఒక రోజు సెలవు కానీ తీసుకోలేని పరిస్థితుల్లో సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) బలగాలు పనిచేస్తున్నాయని పార్లమెంటరీ కమిటినీ ఆందోళన వ్యక్తంచేసింది. అంతేకాకుండా పనివేళల విషయంలో 365 రోజులపాటు 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన దుస్థితిలో సీఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తమ అధ్యయనంలో తేలినట్టుగా స్పష్టంచేసిన కమిటీ.. అతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో సీఆర్పీఎఫ్ బలగాలు పనిచేస్తున్నాయని, ఇది వారి ఆరోగ్యానికి కానీ లేదా లక్ష్యాలకు కానీ అంత శ్రేయస్కరం కాదని అభిప్రాయపడింది. హోం శాఖ వ్యవహారాలపై కాంగ్రెస్ నేత పి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సీఆర్పీఎఫ్ పని విధానాన్ని పరిశీలించిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసింది. పలు రాష్ట్రాల్లో సీఆర్పీఎఫ్ సిబ్బంది బస చేస్తోన్న నివాసాలు పరిశుభ్రంగా లేవని, కనీస వసతుల లేమి మధ్య పనిచేయాల్సి రావడం వారి హుందాతనాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఈ సందర్భంగా కమిటీ పేర్కొంది.
Also read : ఆండ్రూ సైమండ్స్కి చెంప ఛెళ్లుమనిపించే రిప్లై ఇచ్చిన హర్భజన్ సింగ్ !
సీఆర్పీఎఫ్ బలగాలు 12-14 గంటలపాటు పనిచేస్తున్నప్పటికీ... వారిలో 80% మందికి సెలువులు, ఆదివారం సెలవులు సైతం లభించడం లేదని తమ పరిశీలనలో తేలినట్టు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాజ్యసభకు అందించిన నివేదికలో పేర్కొంది.