ప్రభుత్వోద్యోగులను వెంటనే అరెస్టు చేయవద్దు: సుప్రీం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో ఫిర్యాదు నమోదు చేసుకున్న వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. 

Last Updated : Mar 22, 2018, 11:13 AM IST
ప్రభుత్వోద్యోగులను వెంటనే అరెస్టు చేయవద్దు: సుప్రీం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో ఫిర్యాదు నమోదు చేసుకున్న వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ (ప్రివెన్షన్) చట్టం దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వోద్యోగులపై ఇటువంటి కేసులు నమోదైతే తక్షణమే అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈ కేసులపై డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారి చేత ముందుగా ప్రాథమిక దర్యాప్తు చేయించి నిజానిజాలు తెలుసుకున్న తర్వాతనే ఆయన అనుమతి మేరకే అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే వారి సంబంధిత నియామక విభాగం అనుమతి పొందిన తర్వాతనే అరెస్టులు చేయాలని జస్టిస్‌ ఆదర్శ్‌ గోయల్, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఈ చట్టాన్ని ఆయుధంగా చేసుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తూ విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘దురుద్దేశంతో కేసు పెట్టారని, నేరం జరగలేదని ప్రాథమికంగా తెలిసినప్పుడు.. అలాంటి కేసుల్లో ముందస్తు బెయిలు ఇవ్వడంపై సంపూర్ణ నిషేధమేదీ లేదు. అమాయకులను వేధించడానికి చట్టాలను దుర్వినియోగం చేస్తుంటే.. దానిని అరికట్టే అధికారం మాకుందని మరోసారి చెబుతున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 'ఒక పౌరుడి కులమతాలేవైనా అతణ్ని వేధించడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధం. ఆ హక్కుకు ఈ కోర్టు రక్షణ ఇస్తుంది. చట్టం వల్ల కుల విద్వేషాలు రాకూడదు’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

Trending News