దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న పౌరసత్వ సవరణ చట్టం-2019పై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ కేసులో దాఖలైన అన్ని పిటిషన్లను జనవరిలో విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అంతే కాదు .. అప్పటిలోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు పంపించింది. పౌరసత్వ సవరణ చట్టం -2019ను సవాల్ చేస్తూ . . ఇప్పటికే సుప్రీం కోర్టులో దాదాపు 60 పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అసోం గణ పరిషత్, కమల్‌హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యం పార్టీ సహా పలు పార్టీలు, వ్యక్తులు, సంస్థలు.. CAA ను వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు దాఖలు చేశాయి. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించింది.
పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రచురిస్తారా..?
పౌరసత్వ సవరణ చట్టం-2019కు సంబంధించి ప్రజల్లో చాలా మందికి అవగాహన లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే అన్నారు. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ లేవనెత్తిన అంశాన్ని ఆయన ఉటంకించారు. జామియా మిలియా యూనివర్శిటీ సహా ఇతర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న వారికి చట్టంపై అవగాహన లేదని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా ప్రచురించే అవకాశం ఉందా ..? అని ప్రభుత్వ అటార్నీ జనరల్ కె.కె వేణుగోపాల్ ను ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన వేణుగోపాల్ . . ప్రభుత్వ అధికారులు ప్రచురిస్తారని తెలిపారు..
పౌరసత్వ సవరణ చట్టం..CAAపై స్టేకు సుప్రీం నో