ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత శివసేన అగ్రనేత ఏక్నాథ్ శంబాజీ షిండే, సుభాష్ దేశాయ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నుంచి జయంత్ పాటిల్, చగన్ చంద్రకాంత్ భుజ్బల్ వంటి నేతలు ఉద్ధవ్ థాకరే కేబినెట్లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బాలాసాహెబ్ థోరట్, నితిన్ రావత్ వంటి నేతలు ఉద్ధవ్ థాకరే కేబినెట్లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నేడు రాత్రి 8 గంటలకు కొత్త ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహారాష్ట్ర కేబినెట్ తొలిసారిగా భేటీ కానుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి, బీజేపి నేత దేవేంద్ర ఫడణవిస్ కూడా హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబాని తన సతీమణి నీతా అంబాని, తనయుడు అనంత్ అంబానీలతో కలిసి ఈ వేడుకకు విచ్చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి దాదాపు కీలక నేతలు అందరూ ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(MNS) రాజ్ థాకరే, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆ పార్టీ నేత టీఆర్ బాలు ఈ వేడుకకు హాజరై థాకరేకు శుభాకాంక్షలు తెలిపారు.