మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి

Last Updated : Nov 11, 2019, 09:20 PM IST
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి

హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, కేంద్రం కూడా తనవంతుగా దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రజలకు సురక్షితమైన మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని చెబుతూ.. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. మంచినీటి పథకాలు అమలు చేయడంతో పాటు మురుగు నీటిని శుద్ధి చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృయోపయోగ అవసరాలకు ఉపయోగించే విధానాలు అవలంభించాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రగతి భవన్‌లో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన ఉన్నతాధికారుల బృందం పథకం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. 

‘‘తెలంగాణలో 24వేల ఆవాస ప్రాంతాలకు ప్రతీ రోజు ఉపరితల జలాలను మంచినీరుగా అందించేందుకు మిషన్ భగీరథ పథకం చేపట్టాం. తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. చాలా చోట్ల ఫ్లోరైడ్ సమస్య ఉండేది. అసలు తాగునీళ్లే దొరకని పరిస్థితి ఉండేది. దొరికిన నీళ్ళు కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. అందుకే గోదావరి, కృష్ణా జలాలను శుద్ది చేసి ప్రతీ రోజు ప్రజలకు అందివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఈ పథకంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ పథకం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు దూర ప్రాంతాల నుంచి నీరు తీసుకొచ్చే ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పెరిగే జనాభాను కూడా దృష్టిలో ఉంచుకుని.. అప్పటి అవసరాలు కూడా తీర్చే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించాం. ఇలాంటి పథకం దేశమంతా అమలయితే మంచిది. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడొద్దు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రికి వివరించారు.

‘‘దేశ ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నది. కాబట్టి మిషన్ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించండి’’ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తిచేశారు. 11వ శతాబ్దంలోనే కాకతీయులు వేలాది చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని సీఎం చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో జరిగిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి వివరించారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేయగలిగామని వెల్లడించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి, తాను త్వరలోనే మరోసారి తెలంగాణలో పర్యటించి క్షేత్ర స్థాయిలో ఈ పథకాల అమలును స్వయంగా చూస్తానని తెలిపారు.

Trending News