క్రికెట్ రూల్స్ మారాయ్..హద్దు దాటితే బయటికే

Last Updated : Sep 28, 2017, 12:32 PM IST
క్రికెట్ రూల్స్ మారాయ్..హద్దు దాటితే బయటికే

ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. క్రికెటర్ల ప్రవర్తన, రనౌట్, క్యాచ్ , స్టంప్ ఔట్ రూల్స్ లో మార్పులు జరిగాయి. సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం క్రికెట్ నిబంధనల్లో మార్పులకు ఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ కొత్త నిబంధనలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఐసీసీ తీసుకొస్తున్న కొత్త నిబంధనలను ఒక్కసారి పరిశీలిద్దాం...

హద్దు మీరితే బయటికే : 

మ్యాచ్ సమయంలో హద్దులు దాటి ప్రవర్తించే ఆటగాళ్లను అంపైర్లు బయటికి పంపవచ్చు. ఇప్పటి దాకా ఐసీసీ ప్రవర్తన నియమావళి ప్రకారం 1,2,3 స్థాయి నేరాలకు యథాతథ శిక్షలుంటాయి. 4 స్థాయి నేరం ..అంటే అంపైర్ ను బెదిరించడం, ఆటగాళ్లపై భౌతిక దాడికి దిగడం లాంటి చర్యలకు పాల్పడితే ..బయటికి పంపే  అధికారం అంపైర్లకు ఉంటుంది.

రెండు సమీక్షలు మాత్రమే :

టెస్టుల్లో ప్రస్తుతం ఓ ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు అయ్యాక అదనంగా రెండు కొత్త సమీక్ష అవకాశాలున్నాయి. కానీ తాజాగా సవరించిన నిబంధనలు ప్రకారం ఇన్నింగ్ మొత్తం రెండు రివ్యూలు మాత్రమే అమల్లోకి ఉండనుంది.

టి-20 లోనూ అంపైర్‌ నిర్ణయ సమీక్ష : 

ఇప్పటి వరకు టి20లోనూ అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోరే ఛాన్స్ లేదు. తాజాగా రూపొందించిన నిబంధనల ప్రకారం టెస్టుల,వన్డేల మాదిరిగానే టి-20లోనూ అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోరవచ్చు. అయితే రివ్యూకు కొన్ని పరిమితులు విధించింది.

రనౌట్, స్టంప్ ఔట్ రూల్స్‌లో మార్పులు...

రనౌట్,స్టంప్ ఔట్ నిబంధనల్లో  కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు బ్యాట్స్ మెన్ ఒకసారి బ్యాట్ క్రీజులోకి పెట్టాక...బంతి వికెట్లను తాకే సమయానికి బ్యాట్ గాల్లోకి లేచి ఉంటే ఔట్ గా ప్రకటించే వారు..ఇకపై అలాంటి ప్రమాదం ఉందడు. ఒకసారి బ్యాట్‌ క్రీజులోకి పెట్టాక..బంతి వికెట్లకు తాకే సమయానికి గాల్లో ఉన్నా కూడా దాన్ని నాటౌట్ గా పరిగణిస్తారు.

బ్యాట్ సైజులోనూ మార్పులు..

బ్యాట్ సైజు విషయంలోనూ కొన్ని మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. బ్యాట్ సైజు విషయంలో బ్యాట్ పొడవు, వెడల్పు విషయంలో ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ ..మందం విషయంలో ఐసీసీ పరిమితులు విధించింది. బ్యాట్ అంచు దగ్గర మందం 40 మిల్లీ మీటర్లకు మించకూడదు. మిగిలిన చోట్ల మందం గరిష్టంగా 67 మిల్లీమీటర్లు ఉండాలని నిబంధన పెట్టింది.

భారత్‌-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తయిన నేపథ్యంలో చివరి రెండు వన్డేలకు ఈ నిబంధనలు వర్తించవు. ఈ సిరీస్‌ మినహా శనివారం నుంచి జరిగే అన్ని మ్యాచ్‌ల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ముందుగా దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌-శ్రీలంక టెస్టు మ్యాచ్‌ల్లో కొత్త నిబంధనలు చూడబోతున్నాం.

 

Trending News