మాంచెస్టర్: వెస్ట్ ఇండీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోని నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడని పలువురు క్రికెట్ ప్రియులతోపాటు వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సేహ్వాగ్ లాంటి సీనియర్ క్రికెటర్స్ విమర్శించడం ధోని అభిమానులకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. అయితే, విండీస్‌తో మ్యాచ్ అనంతరం ఇదే అంశంపై టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఎప్పుడు, ఏ పిచ్‌పై ఎలా ఆడాలో ధోనికి బాగా తెలుసని, ఎప్పుడూ బాగా ఆడే ఆటగాడిని ఒక్కసారి ఆడకపోయినంత మాత్రాన్నే పనిగట్టుకుని అంతగా విమర్శించాల్సినంత అవసరం లేదని అన్నాడు. మాంచెస్టర్‌లో పిచ్‌పై నెమ్మదిగా ఆడితేనే పరుగులు రాబట్టవచ్చని, ఆమాటకొస్తే, తాను కూడా ఎక్కువగా సింగిల్స్‌తోనే పరుగులు రాబట్టానని కోహ్లీ అంగీకరించాడు. ఏదేమైనా ఆటలో అతడు లెజెండ్ అంటూ ధోనికి కోహ్లీ జై కొట్టడం విశేషం.
ధోనీ పర్‌ఫార్మెన్స్, ఫిట్‌నెస్‌పై కామెంట్స్ చేసిన వారి నోర్లు మూయించి, ధోనిని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కోహ్లీ చేసిన ఘాటైన కామెంట్స్ కచ్చితంగా ధోనిని విమర్శించిన సీనియర్స్‌కి సైతం తగిలే వుంటాయని క్రికెట్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.