Mahabubnagar Lok Sabha Election Result 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితమే మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో పునరావృతమవుతుందని అందరూ భావించారు. కానీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభను కూడా కైవసం చేసుకుంటుందని భావించగా ఓటమిని చవిచూసింది. నువ్వా నేనా అనే రీతిలో జరిగిన లోక్‌సభ పోరులో చల్లా వంశీచంద్ రెడ్డిపై సీనియర్ నాయకురాలు డీకే అరుణ విజయం సాధించారు. రెండోసారి పోటీచేసిన వంశీచంద్ రెడ్డి గట్టి పోటీనిచ్చినా కూడా బ్యాలెట్ ఓట్లతో అతడు పరాజయం అంచున నిలిచారు. ఇక సిట్టింగ్ స్థానాన్ని బీఆర్‌ఎస్ పార్టీ చేజార్చుకుంది. మూడు సార్లు నెగ్గిన గులాబీ పార్టీ ఈసారి మూడో స్థానానికి పరిమితమైంది.
Also Read: Hyderabad Lok Sabha: హైదరాబాద్‌లో మాధవీలతకు ఘోర పరాజయం.. అసదుద్దీన్ భారీ విజయం
ఫలితం ఇలా..
ముఖ్యమంత్రి సొంత జిల్లా.. ఆయన ఎమ్మెల్యే కొడంగల్ స్థానం ఉన్న లోక్‌సభ నియోజకవర్గం మహబూబ్‌నగర్. పాలమూరు స్థానం నుంచి ఈసారి సిట్టింగ్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేయగా.. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చల్లా వంశీచంద్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక బీజేపీ తరఫున జాతీయ నాయకురాలు డీకే అరుణ బరిలో నిలిచారు.
Also Read: Odisha Assembly Results: ఒడిశాలో 24 ఏళ్ల నవీన్ పట్నాయక్ కోట బద్దలు.. బీజేపీ సంచలన విజయం
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో జరిగిన ఎన్నికలో పోలింగ్ శాతం 71.54గా నమోదైంది. ఇక్కడ గెలుపు కోసం చల్లా వంశీచంద్ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మరోసారి లోక్‌సభకు పోటీ చేసి మరోసారి ఓటమిని చవిచూశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వంశీ నియోజకవర్గవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యేలు భారీగా కష్టపడ్డారు. కానీ ఓటర్లు మాత్రం కమలానికి జై కొట్టారు.
మోదీ చరిష్మా, హిందూత్వ ఓట్లు
మహబూబ్‌నగర్ లోక్‌సభలో బీజేపీకి అంతగా బలం లేకున్నా విజయం సాధించడం విశేషం. నరేంద్ర మోదీ చరిష్మా, హిందూత్వ ఓట్లు, డీకే అరుణ పట్టుతో బీజేపీ తీవ్రంగా పోరాడి ఎట్టకేలకు విజయం సాధించింది. పాలమూరు ప్రజలకు డీకే అరుణ సుపరిచితం. గతంలో గద్వాల నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. దీనికి తోడు పరోక్షంగా బీఆర్‌ఎస్ పార్టీ క్రాస్ ఓటింగ్‌త అరుణ గట్టెక్కారనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఆమె పాలమూరు ఎంపీగా గెలిచి సత్తా చాటారు. ఇక ఆమె కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం లభిస్తుందనే వార్త ప్రచారంలో ఉంది.
రేవంత్ రెడ్డికి షాక్
ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సర్వ శక్తులు ఒడ్డినా కూడా గెలుపు తీరాలకు చేరలేదు. కొడంగల్, షాద్‌నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం లభించగా.. మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేటలో కాషాయ పార్టీ ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈవీఎం ఓట్లు పరిశీలించగా.. నువ్వనేనా అనే రీతిలో డీకే అరుణ, వంశీచంద్ పోరాడారు. అతి తక్కువ మెజార్టీతో అరుణ ఆధిక్యంలో ఉండడంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. రేవంత్ రెడ్డి పదిసార్లు పర్యటించినా కూడా పాలమూరు ఓటర్లు కాంగ్రెస్‌ను కనికరించ లేదు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించగా.. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో రేవంత్ పదవికి ఎసరు ఎదురయ్యే అవకాశం ఉంది.
2024 ఎన్నికల అభ్యర్థులు
మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ
డీకే అరుణ, బీజేపీ
చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ
2019 ఎన్నికల్లో
బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మొత్తం ఓట్లు 4,11,402 పోలయ్యాయి.
బీజేపీ అభ్యర్థి ఎస్ గోపాల్ రెడ్డికి 3,33,573 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి 1,93, 631 ఓట్లు పోలయ్యాయి.
ఇక్కడ ప్రధానంగా బీజేపీతో జరిగిన హోరాహోరీ పోరులో మన్నె శ్రీనివాస్ రెడ్డి పైచేయి సాధించి గులాబీ జెండా ఎగురవేశారు.
2014 ఎన్నికలు
జితేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ (నాడు టీఆర్‌ఎస్ పార్టీ)
సుధినీ జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్వరూపం
అసెంబ్లీ నియోజకవర్గాలు: మక్తల్, కొడంగల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, షాద్‌నగర్,
కాంగ్రెస్ ఖిల్లా..
1951లో మొదలైన ఈ నియోజకవర్గంలో పది సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ (నాటి టీఆర్‌ఎస్) హ్యాట్రిక్‌గా మూడు సార్లు గులాబీ జెండా ఎగురవేసింది. మిగిలిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ, జనతా పార్టీ, జనతా దళ్, బీజేపీ ఇలా ఒక్కోసారి విజయం సాధించాయి.
నియోజకవర్గం ఏర్పాటు: 1952
- 1952, 1957, 1962, 1967లో కాంగ్రెస్ పార్టీ విజయం.
- 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి 1971లో గెలుపొందింది. టీపీఎస్ తరఫున జే రామేశ్వర్ రావు ఎంపీగా నెగ్గారు.
- 1977, 1980లో కాంగ్రెస్ విజయం.
- 1984లో జనతా పార్టీ తరఫున జైపాల్ రెడ్డి గెలిచారు.
- 1989, 1991, 1996లో కాంగ్రెస్ పార్టీ విజయం.
- 1998లో జనతా దళ్ పార్టీ తరఫున జైపాల్ రెడ్డి విజయం సాధించారు.
- 1999లో బీజేపీ తరఫున జితేందర్ రెడ్డి నెగ్గారు.
- 2004లో కాంగ్రెస్ నుంచి విఠల్ రావు గెలిచారు.
- అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎగిసిపడడంతో మహబూబ్‌నగర్ లోక్‌సభలో బీఆర్‌ఎస్ పార్టీ (నాటి టీఆర్‌ఎస్) హ్యాట్రిక్ విజయాలను సాధించింది. 2009లో కేసీఆర్, 2014లో జితేందర్ రెడ్డి, 2019లో మన్నె శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.
- 2024లో రెండోసారి కమలం పార్టీ విజయం సాధించింది. డీకే అరుణ ఎంపీగా గెలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter