సీనియర్ ఐఎఎస్ అధికారి శైలేంద్రకుమార్ జోషి నేడు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం నేటితో ముగియనుండటంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జోషి ప్రస్తుతం నీటిపారుదల శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో శైలేంద్ర కుమార్ జోషి డిసెంబర్ 20,1959న జన్మించారు. 1984లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో చేరారు. నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా వృతి జీవితాన్ని ప్రారంభించారు. తెనాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్గా, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా సేవలందించారు. జోషి కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వశాఖలో 1991 నుండి 1994, 2001 నుండి 2006 వరకు తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ శాఖల్లో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పని చేశారు. జోషికి వివాదరహితుడనే పేరుంది.