శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి రాజకీయాల్లోకి వస్తున్నారా? వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు, ఊహాగానాలే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతూ భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నుంచి పరిపూర్ణానంద స్వామికి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పరిపూర్ణానందస్వామి సోమవారం భేటీ కానున్నారని సమాచారం. పరిపూర్ణానంద స్వామికి అమిత్ షా వద్దనుంచి పిలుపు రావడంతో ఆయన ఆదివారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో స్వామి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం జరిగే భేటీలో అమిత్ షా స్వామిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించవచ్చని తెలుస్తోంది.
కాగా, శ్రీరాముడిపై ఫిలిం క్రిటిక్ మహేశ్ కత్తి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో.. పరిపూర్ణానంద స్వామి పాదయాత్రకు సిద్దమై హైదరాబాద్ నగర బహిష్కరణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.