Telangana CLP Meeting: తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచరీ పార్టీ సమావేశం హైదరాబాద్ తాజ్ దెక్కన్ హోటల్‌లో జరిగింది. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. అధికార టీఆర్ఎస్ పార్టీని అవసరమైతే వీధుల్లో ఎండగట్టాలని పీసీసీ నేతలు నిర్ణయించారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై పీసీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్..ఏకంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగమే లేకుండా చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని..70 ఏళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలున్నాయో సభలో స్పష్టమైన వివరణ ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దళిత బంద్..ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ గురించి ప్రశ్నిస్తామన్నారు. రాష్ట్రానికి రావల్సిన వాటా నీటిని కూడా టీఆర్ఎస్ తీసుకురాలేకపోయిందని..సభలో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ , మద్యం వ్యవహారంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామన్నారు. నీళ్ల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో నీటి దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు.
మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ ఇదేనని..డిసెంబర్ నెలలో అసెంబ్లీ రద్దు కానుందని రేవంత్ రెడ్డి మరోసారి జోస్యం చెప్పారు. గవర్నర్ ప్రసంగముంటే..ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నిస్తారనే భయంతో రద్దు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా మోదీకు వ్యతిరేకమని చెప్పుకోవాలనే తాపత్రయం కేసీఆర్‌దని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రమున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు 55 రోజులపాటు జరిగితే..బడ్జెట్ సమావేశాలు నెలరోజులుండేవని చెప్పారు. ఇప్పుడా పరిస్థితి లేదని..కేవలం 8 రోజులకు కుదించేశారన్నారు.
టీఆర్ఎస్‌ను సభలో..వీధుల్లో అడ్డుకుందాం
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని..సభలో అవకాశం రాకపోతే..వీధుల్లో పోరాడుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలపాత్ర పోషించిన విద్యార్ధులు, ఉద్యోగులు, నిరుద్యోగుల్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో టీఆర్ఎస్ నేతల హస్తముందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సుపారీ ఇచ్చారని..ఆ సుపారీ ఇచ్చింది కూడా టీఆర్ఎస్ నేతలేనన్నారు. రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. విభజన బిల్లు ద్వారా రాష్ట్రానికి రావల్సిన రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటివి ప్రభుత్వం సాధించలేకపోయిందన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని..12 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుందని చెప్పారు.
Also read: Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ... బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook