ఆదివారం వెలుగులు విరజిమ్ముతూ భూమిని తేలికపాటి సౌర తుఫాను తాకనుంది. దీంతో ఉపగ్రహ ఆధారిత మొబైల్, డీటీహెచ్ సహా ఇతర సేవలకు స్వల్పంగా అంతరాయం కలగనుంది. సూర్యుడి నుంచి భారీ స్థాయిలో కాస్మిక్ రేణువులు భూమివైపుగా వస్తున్నట్లు ‘‘స్పేస్ వెదర్’’ వెబ్సైట్ తెలిపింది. సూర్యుడి ఉపరితలంపై ఏర్పడ్డ భారీ రంధ్రం భూమివైపు సౌర గాలులను నెట్టుతుండటంతో ఈ తుఫాను వస్తోంది. సూర్యుడి నుంచి భూమివైపు దూసుకొచ్చే ఈ గాలి దక్షిణార్థ గోళంలో వెలుగులు విరజిమ్ముతుందని పరిశోధకులు చెబుతున్నారు.
నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ తీసిన ఓ చిత్రాన్నీ పంచుకుంది. ఇందులో సూర్యుడి బాహ్య పొరలో ఓ రంధ్రం ఏర్పడింది. ఇక్కడి నుంచే భారీ పరిమాణంలో గాలులు బయటకు వస్తాయి. అయితే తాజా చిత్రంలో ఈ రంధ్రం బ్లాక్‌గా కనిపిస్తోంది. దీనికి కారణం భారీ వెలుగులు విరజిమ్మే వాయువులు ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే అని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఈ తుఫాను తీవ్రతను ‘జీ-1’గా నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్వోఏఏ) అంచనా వేసింది. కాగా ఈ నెలలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోనుండటం ఇదే తొలిసారి.