ప్రముఖ బ్రీటీష్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పీహెచ్‌డీ థీసిస్‌ను ప్రచురించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను ఒక్క రోజులో దాదాపు 2 మిలియన్ల మంది వీక్షించడంతో, విపరీతమైన ట్రాఫిక్ లోడ్‌ను తట్టుకోలేక సైట్ క్రాష్ అయ్యింది. హాకింగ్ 1966లో "Properties of Expanding Universes" అనే పేరుతో థీసిస్ రాశారు.
ఆ థీసిస్‌ను ఇటీవలే ఆన్‌లైన్‌లో విద్యార్థుల సౌకర్యార్థం పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500,000 విద్యార్థులు ఈ వార్త వెలువడిన వెంటనే థీసిస్‌ను డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించగా వెబ్సైట్ క్రాష్ అయ్యింది. అయితే ఒక్కరోజులోనే 800,000 మంది ఆ థీసిస్‌ను బ్రౌజ్ చేసినట్లు విశ్వవిద్యాలయ టెక్నికల్ విభాగం పేర్కొంది.
134 పేజీల ఈ థీసిస్ డాక్యుమెంట్ రాసే సమయానికి హాకింగ్ వయసు జస్ట్ 24 సంవత్సరాలే. అప్పుడు ఆయన అదే యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. తర్వాత అక్కడే ప్రొఫెసరుగా జాబ్ సంపాదించారు. గతంలో ఇదే థీసిస్‌ను చదవాలనుకొనే విద్యార్థుల కోసం యూనివర్సిటీ గ్రంథాలయం, ఒక్కో స్కాన్ కాపీకి 65 పౌండ్లు వసూలు చేసేది.
సుప్రసిద్ధ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా ప్రాచుర్యం పొందిన స్టీఫెన్ హాకింగ్ గత కొన్ని సంవత్సరాలుగా మోతార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం కదలడానికి కూడా సహకరించని శరీరంతో, చక్రాల కుర్చీకే అతుక్కుపోయారు. అయినా పరిశోధనలు ఆపలేదు. ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ సహాయంతో తన అసిస్టెంట్లతో మాట్లాడుతూ ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్నారు. కృష్ణ బిలాల పై ఆయన చేసిన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిచ్చాయి.