భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టు నుండి నేపాల్ బయలుదేరారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నేపాల్‌లోని పలు ప్రాంతాలు సందర్శించనున్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఈ పర్యటన దోహదపడుతుందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.
"సబ్కా సాత్.. సబక్ వికాస్" సూత్రాన్ని అనుసరించి సరిహద్దు దేశాల అభివృద్దిని కూడా కాంక్షిస్తూ పలు ఒప్పందాలు చేసుకోవడానికి మోదీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సమృద్ది నేపాల్... సుఖీ నేపాల్ అనే నినాదంతో ముందుకు పోతున్న నేపాల్ అభివృద్దిలో సరిహద్దు దేశంగా భారత్ కూడా తగిన పాత్ర పోషిస్తుందని శాఖ ప్రకటించింది
ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ తర్వాత భారత ప్రధాని ఇరు దేశాల మధ్య కొత్తగా ఏర్పాటు చేస్తున్న జనక్ పూర్ - అయోధ్య బస్ సర్వీసును ప్రారంభిస్తారు. అదేవిధంగా నేపాల్‌లో స్వదేశీ దర్శన పథకంలో భాగంగా రామాయణ సర్క్యూట్‌ను కూడా ప్రారంభిస్తారు.
ముఖ్యంగా నేపాల్ దేశంలో హిందూ మతవ్యాప్తి కోసం అక్కడి పర్యాటక శాఖ సహకారంతో ఈ సర్క్యూట్‌కు నాంది పలికినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఈ పర్యటనలో భాగంగా మోదీ ముక్తినాథ్, ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయాన్ని కూడా సందర్శి్స్తారు. అలాగే ఖాట్మండు మేయర్ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక విందులో కూడా పాల్గొంటారు.