కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వానికి న్యాయపరమైన కేటాయింపులు లభించకపోవడాన్ని ప్రశ్నిస్తూ.. వామపక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చాయి. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రస్‌తో పాటు జనసేన పార్టీలు కూడా ఈ బంద్‌లో పాలుపంచుకున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలో చాలా చోట్ల బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ బస్సుల ముందు బైఠాయించి తమ నిరసనలను తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం ప్రాంతాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది.
రాయలసీమ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య ప్రతినిధులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలు కూడా బంద్‌కు పూర్తి మద్దతును తెలియజేస్తాయి. అనంతపురంలో జవహర్ లాల్ టెక్నాలజీ యూనివర్సిటీ, శ్రీక్రిష్ణ దేవారాయ యూనివర్సిటీలకు సెలవు ప్రకటించారు.
తిరుమల బస్సులు తప్ప.! - చిత్తూరులో (ముఖ్యంగా శ్రీకాళహస్తి- తిరుపతి రహదారిలో) భారీస్థాయిలో రాస్తారోకోలు నిర్వహించారు. తిరుమల కొండకు వెళ్లే 200 బస్సుల మినహా మిగతా బస్సు సర్వీసులు నిలిపివేశారు. అలాగే చెన్నై, బెంగళూరు వెళ్లే అంతర్ రాష్ట్రీయ సర్వీసలు కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో నంద్యాల నుంచి బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యకర్తలు పొద్దున్నుండీ రోడ్లపైనే బైఠాయించడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. ఇక నెల్లూరు జిల్లాలో దాదాపు 800 బస్సు సర్వీసులు నిలిపివేశారు. ప్రకాశం జిల్లాలో మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్, కామధేను మార్కెట్‌లు ఈ రోజు బంద్ కారణం వల్ల మూతబడ్డాయి.
జనసేనతో కలిసి కత్తిమహేష్ ధర్నా..! - విజయవాడలో జరిగిన బంద్ కార్యక్రమంలో వామపక్షాలు, జనసేన ప్రతినిధులతో కలిసి సినీ క్రిటిక్ కత్తి మహేష్ రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ బంద్‌లో పాల్గొంటే బాగుండేదని ఆయన తెలిపారు. నాలుగేళ్లు మిత్రపక్షంలో ఉన్న టీడీపీ... ఈ రోజు అన్యాయం జరుగుతుందని మాట్లాడడం ఏ రాజకీయ ఎజెండా అని ఆయన ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో జరిగిన మోసం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగాలని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విషయంలో రాజీపడకూడదని ఆయన తెలిపారు.
ఏపీ బంద్: కొనసాగుతున్న రాస్తారోకోలు